హైదరాబాద్, ఆంధ్రప్రభ: 2023 సంవత్సరానికి గాను కొలకలూరి పురస్కారాలను ప్రకటించారు. సాహితీ ప్రముఖుల కలం నుంచి వెలువడిన గ్రంథాలను పరిశీలించిన మీదట ఐదు రచనలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. వేర్వేరు కేటగిరీల కింద అవార్డులకు రచనలను ఆహ్వానించారు. యార్లగడ్డ రాఘవేంద్రరావు రచించిన కవితాసంపుటి పచ్చికడుపు వాసన, కటుకోజ్వల ఆనందాచారి రచించిన ఇక ఇప్పుడు కవితా సంపుటిలు కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారానికి ఎంపికయ్యాయి. కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారం కింద ఆకెళ్ల నాటికలు (ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ) విజేతగా నిలిచింది.
తెలంగాణ కథ-వర్తమాన జీవన చిత్రణ, రాచపాళెం సాహిత్య విమర్శ- సమగ్ర అధ్యయనం రచనలను కొలకలూరి రామయ్య పరిశోధన పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆచార్య కొలకలూరి సుమకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార విజేతలకు ఫిబ్రవరి 26న నగదు ప్రోత్సాహంతోపాటు మెమొంటో సత్కారం జరుగుతుందని చెప్పారు. న్యాయనిర్ణేతలు, సాహితీ స్రష్టలకు అభినందనలు తెలియజేశారు. కాగా, అవార్డుల ఎంపికలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య జి.దామోదర నాయుడు, డా. కందిమళ్ల సాంబశివరావు, డా.వి.ఆర్.రాసాని, ఆచార్య మేడిపల్లి రవికుమార్, ఆచార్య బాలసుబ్రహ్మణ్యం, ఆచార్య ఆర్.రాజేశ్వరమ్మ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.