అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూల్‌లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో టీచర్ సహా ఐదుగురు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో నిందితుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. భారీగా పోలీసు వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజన్లు స్కూల్ వద్ద మోహరించాయి. గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని మాడిసన్ పోలీస్ చీప్ షాన్ బార్న్స్ తెలిపారు. మరో ఇద్దరు దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు.
మృతుల్లో టీచర్‌తోపాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారన్నారు. నిందితుడు హాండ్‌గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడని, అతడు కూడా చనిపోయాడని వెల్లడించారు. కాగా, కాల్పుల ఘటనను అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అగ్రరాజ్యంలోని పాఠశాలల్లో కాల్పుల ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత అమెరికాలో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు స్కూళ్లలో 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 1966 తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. ఆ ఏడాది వివిధ స్కూళ్లలో 349 కాల్పుల ఘటనలు జరిగాయి.