మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పాడుబడిన బావిలో పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు క్షేమంగా బయటపడ్డాడు. ఈ దారుణం అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో గత అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే పాడుబడిన బావిలో ఓ పిల్లిలో పడిపోయింది. దీంతో దాన్ని రక్షించేందుకు ఒకరు బావిలోకి దిగారు.
అనంతరం ఒక్కొక్కరిగా ఇలా ఐదుగురు బావిలోకి దిగారు. తిరిగి ఒక్కరు కూడా పైకి రాలేదు. దీంతో ఐదుగురు ప్రాణాలు బావిలోనే పోయాయి. తాడు సాయంతో కిందకి దిగిన వ్యక్తి మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఒకేసారి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
పిల్లిని రక్షించే ప్రయత్నంలో బయోగ్యాస్ కోసం జంతువుల వ్యర్థాలతో నిల్వ ఉన్న బావిలో పడి ఐదుగురు చనిపోయారని అహ్మద్‌నగర్‌లోని నెవాసా పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు. తాడు సాయంతో కిందకి దిగిన విజయ్ మాణిక్ కాలే (35)ను రెస్క్యూ టీమ్ క్షేమంగా రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.