Friday, November 22, 2024

మ‌రో అయిదు రోజులు వ‌ర్షాలు.. 14 జిల్లాల‌లో రెడ్,అరెంజ్ అలెర్ట్ లు జారీ

హైద‌రాబాద్ – అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వానలు మరింత పెరిగే సూచనలున్నాయని పేర్కొంది. మరో వైపు మరో ఐదురోజులు రాష్ట్రంలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన వాతావరణశాఖ.. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నారాయణపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, కామారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. శనివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇవాళ్టి ఉదయం నుంచి నిజామాబాద్‌, కామరెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట, వరంగల్‌, కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా మదనపల్లెలో 8 సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement