పంజాబ్ నుంచి ఐదుగురు ఆప్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, పార్టీ నేత రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫౌండర్ అశోక్ మిట్టల్, ఐఐటీ ఢిల్లి ప్రొఫెసర్ సందీప్ పాఠక్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలు మార్చి 31న జరిగే ఎన్నికలకు నామినేట్ అయ్యారు. అయితే గురువారం సభ్యుల విత్‌డ్రాల్‌కు చివరి రోజు. దీంతో ఈ ఐదుగురు సభ్యులు.. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు రిటర్నింగ్ అధికారి సురిందర్ పాల్ తెలిపారు. మరే ఇతర పొలిటికల్ పార్టీ.. నామినేషన్ వేయలేదని, ఆప్ నుంచి ఈ ఐదుగురు మాత్రమే నామినేషన్ వేయడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవమైందన్నారు. ప్రస్తుతం పంజాబ్ నుంచి సుఖ్‌దేవ్ సింగ్ (శిరోమణి అకాలీ దళ్), నరేష్ గుజ్రాల్ (శిరోమణి అకాలీ దళ్), ప్రతాప్ సింగ్ బజ్వా (కాంగ్రెస్), శంషేర్ సింగ్ (కాంగ్రెస్), శ్వైత్ మాలిక్ (బీజేపీ)లు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్ 9తో పూర్తి అవుతున్నది.
ఆ ఐదుగురు వీరే..
హర్భజన్ సింగ్ మాజీ టీమిండియా క్రికెటర్‌గా అందరికీ పరిచయం. జలంధర్ నుంచి వచ్చిన హర్భజన్.. ఐపీఎల్ జట్లకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అశోక్ మిట్టల్.. పఘ్వారాకు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) వ్యవస్థాపకుడు. ఇది దేశంలోనే తొలి, అతిపెద్ద ప్రైవేటు యూనివర్సిటీ. 33 ఏళ్ల రాఘవ్.. పంజాబ్ వ్యవహారాల కో-ఇన్‌చార్జి. తాజా అసెంబ్లి ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించాడు. సందీప్ పాఠక్.. ఐఐటీ ఢిల్లిలో అసోసియేట్ ప్రొఫెసర్. ఈయన కూడా పంజాబ్‌లో ఆప్ గెలుపులో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. సంజీవ్ ఆరోరా.. ఓ వ్యాపారవేత్త. లూథియానాకు చెందిన ఈయన.. క్రిష్ణ ప్రాన్ బ్రీస్ట్ క్యాన్సర్ చారిటబుల్ ట్రస్టు కొనసాగిస్తున్నారు. అతని తల్లిదండ్రులు క్యాన్సర్‌తో చనిపోవడంతో.. ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా.. 160కు పైగా రోగులను క్యాన్సర్ నుంచి కాపాడారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..