టెక్ దిగ్గజం గూగుల్ ఆల్ఫాబెట్‌లో లైంగిక వేధింపుల అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. సంస్థలోని 500 మందికిపైగా ఉద్యోగులు గూగుల్ సీఈఓకి లేఖ రాయడం కలకలం రేగుతోంది. వేధింపులు తారస్థాయికి చేరాయంటూ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి వీరు బహిరంగ లేఖ రాశారు. ఆల్ఫాబెట్ లో తమపై వేధింపులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ, దాదాపు 500 మందికి పైగా ఉద్యోగినులు సంతకాలు చేస్తూ, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ కి లేఖ రాశారు. తమను ఆదుకోవాలని వారు ఈ లేఖలో వాపోయారు. తమను నిత్యమూ వేధిస్తున్న వారిని ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని, వారిని నియంత్రించాలని కోరారు. వేధింపులకు పాల్పడేవారిని రక్షించడం ఆపాలని కోరారు. గూగుల్ మాజీ ఉద్యోగి ఎమీ నీట్‌ఫీల్డ్ వేధింపులకు గురైతే సంస్థ ఎలా వ్యవహరించిందో తెలియజేస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించిన కొద్ది రోజులకే ఉద్యోగులు ఈ లేఖ రాయడం గమనార్హం.
గూగుల్ లో పని చేసిన తరువాత తనకు మరో ఉద్యోగం చేయాలని అనిపించడం లేదంటూ ఎమీ తన అనుభవాలను టైమ్స్ లో కి రాసిన కథనంలో పూసగుచ్చినట్టు పేర్కొన్నారు. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన అతనితో పాటే బలవంతంగా ముఖాముఖి భేటీలు చేయించారని, పక్కనే కూర్చోబెట్టారని వాపోయారు. గూగుల్‌లో ఎమీది తొలి కేసేమీ కాదని సుందర్ పిచ్చాయ్‌కు రాసిన లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. గతంలోనూ వేధింపులకు పాల్పడి వారినే సంస్థ సమర్థించిందని ఆరోపించారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 2018లో 20వేల మందికి పైగా ఉద్యోగులు నిరసన తెలిపారని.. అయినా సంస్థ వ్యవహారశైలిలో మార్పు రాలేదని దుయ్యబట్టారు.