Saturday, November 23, 2024

TS | జలాశయాల్లో చేపల వేట.. మత్స్యకారులకు సౌరశక్తి పడవలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మత్స్య సంపద వృద్ధి, మత్స్యకారుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఏటా క్రమం తప్పకకుండా జలవనరుల్లో చేప పిల్లలను వదులుతోంది. తాజాగా జలాశయాల్లో చేపల వేట కోసం మత్స్యకారులకు సౌరశక్తి పడవలను అందించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మత్స్యరంగంలో చేపల వేటకు సంబంధించి వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణలోని మత్స్యకారుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాలని తెలంగాణ మత్స్యశాఖ నిర్ణయించింది.

దీంతో త్వరలో మత్స్యకారులకు సౌర పడవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో లోతైన నీటిలో చేపలు పట్టేందుకు అనుగుణంగా మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచాలని మత్స్యశాఖ భావిస్తోంది. ఈ నిర్ణయంలో భాగంగానే సౌర పడవలు అందించాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 100కు పైగా రిజర్వాయర్లలో దాదాపు లక్ష మందికిపైగా మత్స్యకారులు తెప్పల సహాయంతో చేపల వేటను కొనసాగించి జీవనభృతిని పొందుతున్నారు.

- Advertisement -

అయితే లోతైన నీటి నిలువను కలిగి ఉండే రిజర్వాయర్లో తెప్పలపై ప్రయాణం సురక్షితం కాకపోవడంతో మత్స్యకారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెప్పలను నీటిపై నడపడం వాటిపైన వలలో చేరవేయడం జలాశయాలు పట్టిన చేపలను ఒడ్డుకు రవాణా చేసుకోవడం లాంటి కీలకమైన పనుల నిర్వహణలో తెప్పల వినియోగం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని విపత్కర పరిస్థితిలో మత్స్యకారులు ఈ తెప్పలు వినియోగం కారణంగా ప్రాణాలను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తెప్పలు రిజర్వాయర్‌ నీటి మీద నడపడానికి మత్స్యకారులు తమ రెండు చేతులను ఉపయోగించి తెడ్డు సహాయంతో చాలా కష్టపడాల్సి వస్తోంది. ఫలితంగా మత్స్యకారుల శరీర శ్రమ విపరీతంగా వినియోగించాల్సి వస్తోంది. తెప్పలపై కూర్చోవడం కూడా ఇబ్బంది కావడంతో పాటుగా తెప్పలు నడుపుతున్న సమయంలో మత్స్యకారులు తమకాళ్లను మోకాల్లోతు నీటిలో ఉంచాల్సి ఉంటుంది ఈ కారణంగా మత్స్యకారుల కాళ్ళు నీళ్లలో నాని పుండు కొట్టి అనారోగ్యం పాలవుతున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.

అదేవిధంగా తెప్పల పైన పైకప్పు లేకపోవడం వల్ల ఎండాకాలం విపరీతమైన ఎండలు భరించాల్సి వస్తోంది. ఫలితంగా వర్షాకాలంలో చేపల వేటను మానుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల కష్టాలను దూరం చేసేలా సౌర పడవలను అందించాలని తెలంగాణ మత్స్యశాఖ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌ రిజర్వాయర్‌ ఫిషరీస్‌లో దేశ విదేశాలలో అమలులో ఉన్న విధానాలను స్వయంగా అధ్యయనం చేసి మత్స్యకారులకు సౌరపడవలను అందించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement