అమరావతి, ఆంధ్రప్రభ : చేపలుసాగు చేసే రైతులకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా అందించే సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అగ్రి ల్యాబుల్లో నాణ్యతా పరీక్షలు నిర్ధారించాక సర్టిఫైడ్ చేసిన మేతను సరఫరా చేస్తున్న ఆర్బీకేల నుంచి ఇకపై చేపల సీడ్ (పిల్లలు)ను కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 54 ఫిష్ ఫీడ్ ఫామ్స్ తో ఆర్బీకేలను అనుసంధానం చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని ఫిష్ ఫామ్స్ నడుస్తుండగా మరికొన్నింటిని రైతులు నిర్వహిస్తున్నారు. సాగులో ఉన్న చేపల చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా ఫిష్ ఫామ్స్ లో సీడ్ ఉత్పత్తి అవుతుంది.
చేపల పెంపకం కోసం లైసెన్సు ఉన్న 1817 లైసెన్సుడ్ రిజర్వాయర్ల కోసం ప్రభుత్వం సీడ్ ను పంపిణీ చేస్తోంది. 10.10 కోట్ల సీడ్ అవసరమని అధికారులు తాజాగా అంచనాలు రూపొందించగా ఫిష్ ఫామ్స్ లోనూ ఆ మేరకు సీడ్ ఉత్పత్తి అవుతున్నట్టు అంచనా. ఇప్పటికే 3.09 కోట్ల ఫిష్ సీడ్ ను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయగా.. పూర్తిస్థాయిలో ఫిష్ సీడ్ ను చేపల సాగుదారులకు అందించేందుకు ఆర్బీకేల పరిధిలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 10778 ఆర్బీకేలుండగా 734 ఆర్బీకేల్లో మత్స్య సేవలందించేందుకు సహాయకులు ఉన్నారు.
వారందరికీ ట్యాబులు అందించిన మత్స్యశాఖ చేపల సాగుదారులకు వివిధ సేవలందించేందుకు అవసరమైన సాప్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-మత్స్యకార పేరుతో ప్రత్యేక మైన యాప్ ను రూపొందించింది. ఈ-మత్స్యకార యాప్ తో రాష్ట్రంలోని 54 ఫిష్ ఫామ్స్ ను అనుసంధానం చేయటం ద్వారా ఎప్పటికపుడు నాణ్యత దృవీకరించిన సీడ్ ను చేపల సాగుదారులకు అందించే ఏర్పాట్లను మత్స్య సహాయకులు పర్యవేక్షిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా చేపల సీడ్ ను బుక్ చేసి జిల్లాల వారీగా లైసెన్సుడ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.