ఒక వైపు కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే మరో వైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. వైట్ ఫంగస్ బారినపడినవారిలో కొత్త తరహా లక్షణాలు బయటపడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులలో మల్టీఫోకల్ చిల్లులు పడిన తెల్ల ఫంగస్ కేసు నమోదైంది.
అయితే ప్రపంచంలోనే తెల్లటి ఫంగస్ మొట్టమొదటి కేసు ఇది. తీవ్రమైన కడుపు నొప్పి, మలబద్ధకం, వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయి. మే 13న 49 ఏళ్ల మహిళను సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు సిటీ స్కాన్ చేయగా, ఆహార పైపు దిగువ భాగంలో రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అప్పుడు సర్జన్ల బృందం అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించింది. ఇలా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లు వెంటాడుతుండటంతో జనాలు గజగజ వాణికిపోతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్, హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అనిల్ అరోరా మాట్లాడుతూ, ఆహార పైపులో మల్టీఫోకల్ చిల్లులు కలిగించే వైట్ ఫంగస్ (కాండిడా), కరోనా వ్యాప్తిలో చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులో ఏర్పడుతుందని అంటున్నారు. కాగా స్టెరాయిడ్లను అధికంగా వాడటం వల్ల ప్రేగులో రంధ్రాలు కలిగించే బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.