హైెదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇంతలా విద్యుత్ వినియోగం పెరడడం ఇదే మొదటిసారి. గత ఏడాది వినియోగాన్ని అధిగమించి మంగళవారం ఉదయం 10:03 గంటలకు 15,062 మెగావాట్ల వినియోగం నమోదైందని విద్యుత్ శాఖ ప్రకటించించింది. సోమవారం రోజున 14,138 మెగావాట్ల విద్యుత్ వాడకం జరిగింది. కాగా మంగళవారం నమోదైన విద్యుత్ ఖర్చు.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగమని విద్యుత్ శాఖ వెల్లడించింది. వ్యవసాయ సాగు విస్తీర్ణం , రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో పాటు ఇళ్లలో కూడా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది.
మొత్తం వినియోగంలో వ్యవసాయరంగానికి 37 శాతం వాడుతుండగా.. మిగిలిన విద్యుత్‌ను పారిశ్రామిక, ఇతర రంగాలకు వినియోగిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, తమిళనాడు మొదటి స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది మార్చి నెలలో 14,160 మెగావాట్ల అత్యధిక వినియోగం కాగా, ఈ సారి డిసెంబర్ నెలలో గత సంవత్సర రికార్డును అధిగమించింది. ఈ నెలలోనే 14,750 మెగావాట్ల పీక్ విద్యుత్ వినియోగం నమోద కాగా.. దాన్ని అధిగమించి 15,062 మెగావాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయ్యింది.
ఈ సంవత్సరం వేసవికాలంలో 16 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అకాశం ఉందని టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఎంత వచ్చినా అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని, మార్చి నెలలో 15 వేల మెగావాట్ల నమోదు అవుతుందని ముందే ఊహించామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర రైతులకు, వివిధ రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని సీఎండీ ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు.
ముగ్గురు లైన్‌మెన్లకు ఉత్తమ అవార్డులు..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు చెందిన ముగ్గురు లైన్‌మెన్లకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉత్తమ అవార్డులు అందజేసింది. లైన్‌మెన్ దినోత్సవం సందర్భంగా ఢిల్లిdలో నిర్వహించిన కార్యక్రమంలో కె. ఈశ్వర్‌రెడ్డి ( సిద్దిపేట సర్కిల్), డి. మల్లారెడ్డి ( హబ్సిగూడ్ సర్కిల్), కొండూరు మల్లయ్య ( సరూర్‌నగర్ సర్కిల్) లు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రంతో పాటు మెడల్‌ను బహుకరించారు. ఉత్తమ్ అవార్డులు అందుకున్న లైన్‌మెన్లను టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డైరెక్టర్ జె. శ్రీనివాస్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులు అభనందించారు.