Sunday, November 24, 2024

First Test – యశస్వి జైస్వాల్ శతకం

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకంతో కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొని డకౌటైన జైస్వాల్..

రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించాడు. 205 బంతుల్లో ఎనిమిది బౌండరీలు, మూడు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అప్పర్ కట్‌తో సిక్సర్ బాది జైస్వాల్ మూడంకెల స్కోరును అందుకోవడం విశేషం.ఈ క్రమంలో జైస్వాల్ అరుదైన రికార్డులు బద్దలుకొట్టాడు.

23 ఏళ్ల కంటే తక్కువ వయస్సులో భారత్ తరఫున ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి సరసన జైస్వాల్ సంయుక్తంగా నిలిచాడు. 1984లో రవిశాస్త్రి, 1992లో సచిన్ టెండూల్కర్, 2024లో జైస్వాల్ మూడేసి శతకాలు బాదారు. అగ్రస్థానంలో సునీల్ గవాస్కర్, వినోద్ కాంబ్లీ సంయుక్తంగా ఉన్నారు. 1971లో గవాస్కర్, 1993లో వినోద్ కాంబ్లీ నాలుగు శతకాలు సాధించారు.

23 ఏళ్ల వయస్సులోపు భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన మూడో ప్లేయర్‌గానూ యశస్వీ జైస్వాల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 4 సెంచరీలు బాదిన జైస్వాల్.. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (8), రవిశాస్త్రి (5) ఉన్నారు.

- Advertisement -

ఇక ఆస్ట్రేలియాలో 2014-15 తర్వాత సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గానూ జైస్వాల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు చివరిగా సిడ్నీ టెస్టులో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ శతకం బాదాడు. అలాగే తమ తొలి ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా జైస్వాల్ ఘనత సాధించాడు.

1967/68లో జయసింహా, 1977/78లో సునీల్ గవాస్కర్ తమ తొలి ఆసీస్ పర్యటనల్లోనే శతకం బాదారు. ముగ్గురు రెండో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. కాగా, కేఎల్ రాహుల్‌తో కలిసి భాగస్వామ్యం పరంగానూ జైస్వాల్ రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా జైస్వాల్-కేఎల్ రాహుల్ నిలిచారు. వీరిద్దరు 201 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. రాహూల్ 77 పరుగులు చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ నష్టానికి 255 పరుగులు చేసింది. జైస్వాల్ 137. , పడికల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement