యూకేలో తొలిసారి మనుషుల్లో స్వైన్‌ఫ్లూ వైరస్ బయటపడింది. దేశంలో ఇదే తొలి హెచ్1ఎన్2 కేసని లండన్ వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ)కి సమాచారం ఇచ్చారు. వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన వారని గుర్తించే పనిలో ఆరోగ్య అధికారులు పడ్డారు. కాగా, 2005 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా యాభై మానవ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. యూకేలో ఇది కొత్తకేసు.
మునుపటి కేసులతో జన్యుపరంగా సంబంధం లేనిది. ఇన్‌ఫ్లూ ఎంజా (హెచ్1ఎన్2) అనేది యూకేలో పందులలో వ్యాపించే ఫ్లూ వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, యూకేలో కనుగొనబడిన ఇన్‌ఫెక్షన్ 1బి.1.1 అనే ఒక ప్రత్యేకమైన క్లాడ్ లేదా రూపం. ఇది ప్రపంచంలో ఇతర చోట్ల వెలుగు చూసిన హెచ్1ఎన్2 కేసులకు కాస్త భిన్నంగా ఉంది.
వైరస్ సోకిన వ్యక్తి ఎవరన్నది గుర్తించబడలేదని, అతను తేలికపాటి అనారోగ్యంతో కోలుకున్నాడని సమాచారం. అతడు ఆసుపత్రిలో చేరలేదు. పైగా పందుల పెంపపం లేదా పందులకు దగ్గరగా ఉన్నట్లు కూడా సరైన ఆధారాల్లేవని గార్డియన్ కథనం పేర్కొంది. అతడికి ఇన్ఫెక్షన్ ఎలా సోకింనే దానిపై పరిశోధిస్తున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కాంటాక్ట్ ట్రేసింగ్‌ను నిర్వహిస్తోంది. ఈదశలో స్ట్రెయిన్ ఎంతవరకు వ్యాపిస్తుంది, ఇంకా ఎక్కడైనా కేసులు నమోదై ఉన్నాయా? అనే కోణంలా విచారణ జరుపుతున్నారు.
ఎలా గుర్తించారు?
రొటీన్‌ఫ్లూపై నిఘా పెట్టడం వల్ల, జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ వైరస్‌ను గుర్తించగలిగామని యూకేహెచ్‌ఎస్‌ఎ డైరెక్టర్ మీరా చంద్ తెలిపారు. యూకేలో మానవులలో ఈ వైరస్‌ని గుర్తించడం ఇదే మొదటిసారి. అయితే ఇది పందులలో కనుగొనబడిన వైరస్‌లను పోలివుంది. నార్త్ యార్క్‌షైర్‌లోని కొన్ని ప్రాంతాలలో శస్త్రచికిత్సలు, ఆసుపత్రులకు సంబంధించిన కార్యక్రమాలలో నిఘాను పెంచుతున్నాం అని చెప్పారు.