హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీని సిద్ధిపేటలోనే స్థాపించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300కోట్లతో 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని సిద్ధిపేట జిల్లాలో ప్రారంభంకావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నామన్నారు. వ్యవసాయం చేసే రైతులు నాలుగు డబ్బులు సంపాదిస్తే ఆనందమని, రైతులు వరి పంట ఒకటే సాగు చేయటంమూలాన తగిన ఆదాయం పొందలేకపోతున్నారని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో ఆయిల్‌పామ్ జిల్లాగా సిద్ధిపేటను డిక్లేర్ చేయించామన్నారు.
ఎకరానికి రూ.80వేల సబ్సిడీ ఇస్త్న్నుట్లు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ కోతులు, పందులు, చీడపీడ లేని పంట.. ధర రాదనే బాధ లేదన్నారు. ఎకరానికి తక్కువలో తక్కువ రూ.1.50లక్షల వరకు నికరంగా లాభం వస్తుందన్నారు. పంట కొనేది ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ సంస్థ అనీ, ఫ్యాక్టరీ సిద్ధిపేట జిల్లాలోనే ఉందన్నారు. గవర్నమెంట్ ఉద్యోగికి ఎంత జీతం వస్తదో.. ఆయిల్ పామ్ రైతుకు అంతే వస్తదని చెప్పారు. జూలై కల్లా 20వేల ఎకరాలకు ఫామ్ ఆయిల్ మొక్కలు రెడీగా ఉన్నాయని, ఇప్పటికే 3వేల ఎకరాల్లో పంటవేశారన్నారు. ప్రజాప్రతినిధులు ప్రతీ మండలంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..