Wednesday, November 20, 2024

First Anniversary – పెట్టుబడుల .. జాతర! తరలివస్తున్న అంతర్జాతీయ ప్రాజెక్టులు

తెలంగాణకు క్యూ కట్టిన 141 కంపెనీలు
35వేల కోట్ల పెట్టుబడులకు సన్నద్ధం
51వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
1.5లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు
సీఎం రేవంత్​, ఐటీ మంత్రి శ్రీధర్​బాబు చొరవ
హైదరాబాద్​లో సెమీ కండక్టర్ల యూనిట్​
హెల్​కేర్​ రంగంలో ఏఐ సమ్మిట్​కు సన్నాహాలు
అండర్​ 18 స్టూడెంట్స్​తో మాక్​ అసెంబ్లీ
సోషల్​ మీడియాలో చిచ్చరపిడుగుల ముచ్చట్లు
గురుకుల పాఠశాలలపై ప్రత్యేక నజర్​
కుళ్లిన కూరగాయాలు, దొడ్డు వడ్ల బియ్యం వద్దు
ఎక్కడైనా వండివార్చినట్టు తెలిస్తే సీరియస్​ యాక్షన్​
తెలంగాణలో మొదలైన కొలువుల జాతర
ఏడాది ప్రజాపాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: రేవంత్ సీఎంగా పగ్గాలు చేపట్టాక అటు అమెరికా, సౌత్ కొరియా పర్యటనలు చేపట్టారు. పెట్టుబడులే లక్ష్యంగా చేసిన ఈ పర్యటనలు ఏడాదిలోపే సత్ఫలితాలు ఇచ్చాయి. అందుకు నిదర్శనంగా భారీగా వచ్చిన పెట్టుబడులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన 141 కంపెనీలు ₹35,820 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో 51వేల మందికి ప్రత్యక్షంగా, లక్షన్నర మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.

హెల్​కేర్​లో ఏఐ సమ్మిట్​..

అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు అతి త్వరలోనే లైఫ్‌ సైన్సెస్‌ నూతన విధానాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన 141 కంపెనీల్లో కొన్ని నిర్మాణాలు మొదలుపెట్టగా.. మరికొన్ని ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉన్నాయి. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్ర బిందువైంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఉద్దేశంతో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమ్మిట్స్ నిర్వహిస్తున్నారు. హెల్త్‌కేర్, ఫార్మా రంగంలో ఏఐ ప్రాముఖ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో 18 తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌ నిర్వహించబోతోంది.

సీఎం ఆలోచన సూపర్

- Advertisement -

నవంబర్​ 14వ తేదీ.. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా SCERTలో పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలను అభినందిస్తూనే.. 21 ఏళ్లకే ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేలా వయసు కుదించాలని సూచన చేశారు. కాగా, సోషల్​ మీడియాలో అండర్​ 18 చిచ్చరపిడుగులు చేసిన అల్లరి అంతా ఫుల్​ హల్​చల్​ అవుతోంది.

గురుకులాలపై స్పెషల్ నజర్

సాధారణంగా ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలు అంటే పురుగుల అన్నం, నీళ్ల చారు, ఫుడ్ పాయిజన్ ఇవే సమస్యలు వస్తుంటాయి. అయితే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకోబోమని స్పష్టం చేస్తోంది. బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్​ పాల్గొన్నారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామని, దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలతో వండి పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు వారానికి రెండుసార్లైనా ప్రభుత్వ హాస్టల్స్​లో పర్యటించాలనే రూల్​ పెట్టారు.

కొలువుల జాతర

ఎప్పటికప్పుడు పరీక్షలు పెట్టడం, ఫలితాలు ప్రకటించడం, ఆ వెంటనే నియామకాలు చేపట్టడం.. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కనిపిస్తున్న మార్పు. గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు రిలీజై.. రిజల్ట్స్ రాక, నియామకాలు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలకు తాజా ప్రభుత్వం చెక్ పెడుతోంది. లేటెస్టుగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్-4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన తుది జాబితాను రిలీజ్ చేసింది. 2022 డిసెంబర్ 1వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్‌లో భాగంగా 8,180 పోస్టులకు గాను 9లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

సిటీకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం చూసి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్లస్ అవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ సెమీకండక్టర్ల కంపెనీ అలెగ్రో మైక్రోసిస్టమ్స్‌ హైదరాబాద్‌లో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి ముందుకువచ్చింది. ఈమేరకు ఆ కంపెనీ సీఈఓ టీమ్ సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో ఈనెల 15వ తేదీన భేటీ అయ్యింది. పలు ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలకు సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నట్లు అలెగ్రో ప్రతినిధులు మంత్రికి వివరించారు. అలెగ్రో పరిశోధనాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement