జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా చినిగామ్‌లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. సైన్యం రెండు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. మొదటి ఆర్మీ ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల తర్వాత చినిగాం గ్రామంలో మరో కాల్పుల ఘటన వెలుగు చూసింది.
లష్కర్ గ్రూప్ గురించి ఆర్మీకి సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు గాయపడగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ సైనికుడు వీరమరణం పొందాడు.
దీంతో పాటు శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని కతువా, ఉధంపూర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్తో సహా ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) జవాన్లు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. కతువా జిల్లాలోని రాజ్‌బాగ్ సమీపంలో వాహనం రోడ్డుపై నుంచి జారి ఉజ్ కాలువలో పడిపోయిందని.. ఈ ప్రమాదంలో, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఏఎస్ఐ పర్షోతమ్ సింగ్ వీరమరణం పొందారు.