యూపీలోని అయోధ్య రామమందిరం కాంప్లెక్స్ లో కాల్పులు కలకలం రేపాయి. భద్రతా ఏర్పాట్లలో మోహరించిన ఎస్ఎస్ఎఫ్ జవాన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బుధవారం తెల్లవారుజామున 5.25 గంటలకు రామజన్మభూమి భద్రత కోసం మోహరించిన ఓ జవానుపై అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. బుల్లెట్ శబ్ధం విని ఘటనాస్థలానికి వచ్చిన సైనికులు..రక్తం మడుగులో ఉన్న జవాన్ ను గుర్తించారు.
వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జవాన్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాల్పులకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అంతకుముందు మార్చిలో కూడా ఆలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ ప్లాటూన్ కమాండర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
రామజన్మభూమి కాంప్లెక్స్‌లో మరణించిన జవాన్ అంబేద్కర్ నగర్ జిల్లా వాసి. అతని పేరు శత్రుఘ్న విశ్వకర్మ అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రామాలయ భద్రత కోసం ప్రత్యేకంగా ఎస్ ఎస్ ఎఫ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.