పంజాబ్ బఠిండా మిలిటరీ స్టేషన్ లో ఆగంతకులు కాల్పులు జరిపారు.. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కాల్పులలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. కాల్పులు వినిపించగానే స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఈ ఘటన సైనిక స్థావరం లోని శతఘ్ని యూనిట్‌లో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఇది జరిగినట్లు భావిస్తున్నారు. మృతులను నిర్ధారించారు. ఆ ప్రదేశంలోనే సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. పౌర దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్ రైఫిల్, 28 తూటాలు అదృశ్యమయ్యాయి. ఈ ఘటనలో వీటిని వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన సమాచారం అందగానే పంజాబ్ పోలీసులు మిలిటరీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదని బఠిండా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్పీ) వెల్లడించారు. కాగా.. కాల్పుల ఘటనలో ఉగ్ర కోణం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బఠిండా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఇక్కడ కీలకమైన 10వ కోర్ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపుర్ కేంద్రంగా పనిచేసే సౌత్-వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తుంది. బఠిండాలో పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఉన్నాయి. కాల్పులు జరిపిన వారి కోసం ఇటు మిలటీరి,అటు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.