హర్యానాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగి ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. కాగా, రెండు డజన్ల మందికి పైగా తీవ్రంగా కాలిపోయారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈ ప్రమాదం గత రాత్రి తవడు సబ్‌డివిజన్ సరిహద్దు కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది.
ఇది గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు శాయశక్తులా ప్రయత్నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వాహనాలు చాలా ఆలస్యంగా వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. అప్పటికి బస్సులో ఉన్న వ్యక్తులు తీవ్రంగా కాలిపోగా, ఎనిమిది మంది చనిపోయారు. తవడు సదర్ పోలీస్ స్టేషన్ అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి పంపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కొద్దిసేపటికే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర బిజారానియా కూడా తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజారానియా తెలిపారు. దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారు. అందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చర్యలకు పూనుకున్నారు. దీంతో పాటు తవడు ఎస్‌డిఎం సంజీవ్‌కుమార్, తవడు సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి జితేంద్రకుమార్, డిఎస్పీ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు చాలా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు, ప్రస్తుతం మృతులను గుర్తించలేదు.