Tuesday, November 26, 2024

చిలీ అడవుల్లో కార్చిచ్చు.. 13 మంది సజీవదహనం

లాటిన్‌ అమెరికాలోని చిలీ అడవుల్లో కార్చిచ్చు రాజుకుంది. శరవేగంగా వ్యాపిస్తున్న ఈ అగ్నిజ్వాలలో ఇప్పటి వరకు 13 మంది సజీవ దహనమయ్యారు. కాగా, దేశవ్యాప్తంగా 190కిపైగా ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వందలాది ఇళ్లను మంటలు దహించివేశాయని.. మొత్తం 14వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దహించుకుపోయిందని పేర్కొన్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన హెలికాప్టర్‌ కూలి పైలెట్‌ మృతి చెందినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 190కిపైగా ప్రాంతాల్లో కార్చిచ్చు చెలరేగగా.. 45 ప్రాంతాల్లో మాత్రమే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారని ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియల్‌ ప్రకటించారు.

బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల సహాయంతో 63 విమానాలతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు వందల ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు హోంమంత్రి కరోలినా తోహా వెల్లడించారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కార్చిచ్చు కారణంగా వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్‌ ఫారెస్ట్రీ కార్పొరేషన్‌ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement