స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగల్లో చిక్కుకున్న సుమారు 21 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జార్ఖండ్ రాష్ట్రం బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్లాంట్లో ఈ సంఘటన జరిగింది. స్టీల్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సుమారు 21 మంది కార్మికులు ఆసుపత్రిపాలయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
కాగా, నిర్వహణ పనులు చేస్తుండగా గ్యాస్ పైప్లైన్ పేలడంతో మంటలు చెలరేగాయని స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ అలారం మోగడంతో కార్మికులంతా ప్లాంట్ నుంచి బయటకు వెళ్లారని చెప్పారు. పైప్లైన్ నుంచి ఎలాంటి గ్యాస్ లీకేజీ జరుగలేదని అన్నారు. మంటలను అదుపు చేశామని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని స్టీల్ ప్లాంట్ అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన 21 మంది కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని తెలిపారు.