Saturday, September 7, 2024

Fire Accident – కనిపించలేదా లేక నిద్రపోతున్నారా?.. రాజ్‌కోట్ గేమింగ్ జోన్ దుర్ఘటనపై హైకోర్టు ఆగ్రహం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 28 మందిని బలిగొన్న గేమింగ్ జోన్ అగ్నిప్రమాద ఘటనలో మున్సిప‌ల్ అధికారుల నిర్లక్ష్యంపై గుజరాత్ హైకోర్టు విరుచుకుపడింది. రెండేళ్లుగా రాజ్‌కోట్‌లో రెండు గేమింగ్ జోన్లు ఫైర్ సేఫ్టీ సహా ఎలాంటి అనుమతుల్లేకుండానే నడుస్తున్నాయని కోర్టు దృష్టికి రావడంతో అధికారులపై కన్నెర్రజేసింది. ఈ విషయంలో ఇకపై తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మబోమని తేల్చిచెప్పింది.

కండ్లు మూసుకుపోయాయా?

ఈ దుర్ఘటన జరిగిన గేమింగ్ జోన్ సంస్థ తమ అనుమతి తీసుకోలేద‌ని రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పగా కోర్టు మండిపడింది. ‘రెండున్నరేళ్లుగా ఆ గేమింగ్ జోన్ నడుస్తోంది. మీరు, మీ అనుచరులు ఏం చేస్తున్నారు? మీకు కళ్లు లేవనుకోవాలా?’ అని హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఆ గేమింగ్ జోన్ లో అధికారులు ఉన్నప్పటి ఫొటోలను చూసి మరింతగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరంతా అంధులయ్యారా? లేకపోతే నిద్రపోతున్నారా? నాలుగేళ్లుగా ఫైర్ సేఫ్టీ అనుమతుల వివాదం కొనసాగుతుంటే ఏం చేస్తున్నారు? మేం ఇకపై స్థానిక యంత్రాంగాన్ని, రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని ఏమాత్రం నమ్మం’ అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

అనుమ‌తి లేని సంస్థ‌లపై ద‌ర్యాప్తు..

గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వొకేట్ మనీషా లవ్ కుమార్ షా స్పందించారు. గుజరాత్ లో అనుమతుల్లేకుండా నడుస్తున్న ఇలాంటి సంస్థల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. 72 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు యజమానులను పోలీసులు అరెస్టు చేశారని అడ్వొకేట్ వివరించారు. మిగిలిన వారిని అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

అసంతృఫ్తి వ్య‌క్తం చేసిన హైకోర్టు

అయితే.. ఈ వాదనలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగేళ్ల కాలంలో జరిగిన ఈ తరహా ప్రమాదాల నివారణకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది. అయినప్పటికీ గుజరాత్‌లో ఆరు భారీ ప్రమాదాలు జరిగాయని పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగం పనిచేయకపోవడం వల్ల ప్రజలు మరణిస్తున్నారని వ్యాఖ్యానించింది. మరోవైపు గేమింగ్ జోన్ కు అనుమతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించనందుకు ఆరుగురు అధికారులను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం అదనపు డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పున అందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement