ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేదిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుల ఫిర్యాదుచేసింది. దీంతో హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అతనిపై సెక్షన్ 376 (రేప్) కేసుతో పాటు బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నార్సింగ్ పీఎస్‌కు బదిలీ చేశారు. ఔట్ డోర్ షూటింగ్స్ టైంలో, నార్సింగిలోని తన నివాసంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని అందులో పేర్కొన్నది..
మధ్యప్రదేశ్‌కి చెందిన 21 ఏండ్ల మహిళ.. గత ఆరు నెలలుగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది.
నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు పేర్కొంది.జానీ మాస్టర్‌పై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇక ఈ ఏడాది జూన్‌లో సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. సినిమాల్లో అవకాశాలు రాకుండా తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు.