Friday, October 18, 2024

Delhi | ముగిసిన ఐఐటీఎఫ్ 2023.. ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు కాంస్య పథకం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వసుదైక కుటుంబం-యునైటెడ్ బై ట్రేడ్ థీమ్‌తో దేశ రాజధానిలో నిర్వహించిన భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన 2023లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు కాంస్య పథకం దక్కింది. ఈనెల 14 నుంచి 27 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే ఐఐటీఎఫ్‌లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రారంభించారు. ఈ సంవత్సర థీమ్‌ను అనుసరించి ఏపీలో వాణిజ్యం, మౌలిక వసతుల కల్పనలో పురోగతి, నైపుణ్యం, ఆర్థిక సామర్ధ్యం ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే  ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర ప్రత్యేకతను జాతీయ స్థాయిలో సందర్శకులు గుర్తించేవిధంగా ఉత్పత్తులు ప్రదర్శించారు. పెవిలియన్‌లో ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు జరుగుతున్న ఎగుమతుల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధి, ప్రగతి, ప్రభుత్వ పాలసీలు వంటివి సందర్శకులకు తెలిసే విధంగా సమాచారాన్ని వివిధ రూపాలలో ప్రదర్శించారు. ఈ పెవిలియన్‌లో ౩౦ స్టాల్ల్స్ ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన చెక్క బొమ్మలు, ఉదయగిరి కట్లెరీ, పచ్చళ్ళు, పిండివంటలు, మంగళగిరి చీరలు, నర్సాపురం లేస్, ఏలూరు తివాచీలు, ఆత్రేయపురం పూతరేకులు, పెడన కలంకారీ, శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, నిమ్మలకుంట తోలుబొమ్మలు, వివిధ రకాల వస్తువులను రాష్ట్ర పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచారు.

- Advertisement -

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు-నేడును ప్రతిబింభించే విధంగా గ్రామ వార్డ్ సచివాలయాలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, పశు వైద్యశాల, పాడి పరిశ్రమ, రైతు భరోసా కేంద్రాలు, శీతల గిడ్డంగులు మొదలైన శాఖలలో చేపడుతున్న చర్యలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక వాడలు, పరిశ్రమల కారిడార్లు, విమానాశ్రయాలు, ఓడ రేవులు మొదలైన వివరాలతో ఏర్పాటు చేసిన వేరొక నమూనా కూడా పలువురిని ఆకర్షించింది. జ్యూరీ అవార్డులలో ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌కు కాంస్య పథకం లభించింది.

ఐటీపీఓ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుర ప్రసాద్ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, పెవిలియన్ డైరెక్టర్ సుధాకర్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిచే విధంగా 24వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ డే వేడుకలకు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ బండి శివశక్తి నాగేంద్ర పుణ్యశీల హాజరయ్యారు. వీరితో పాటు  పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ యువరాజు, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జి.ఎస్. రావు, పెవిలియన్ డైరెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement