ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా కొనసాగి, విజయవంతమైన సారథిగా పేరు సంపాదించుకున్నఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాదే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్.. 2021లో దేశానికి ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించాడు. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన ఫించ్.. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఫించ్ తన అంతర్జాతీయ కెరియర్‌లో 8,804 పరుగులు చేశాడు. 17 వన్డే సెంచరీలు, రెండు టీ20 శతకాలు సాధించాడు.
తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడిన ఫించ్.. ఆ మ్యాచ్‌లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2018లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 76 బంతుల్లోనే 172 పరుగులు బాదిన ఫించ్.. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే, 2013లో ఇంగ్లండ్‌తో సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 156 పరుగులు సాధించాడు. 36 ఏళ్ల ఫించ్ తన కెరియర్‌లో ఐదు టెస్టులు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడాడు. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు ఆడడం సాధ్యం కాదన్న విషయం తనకు తెలుసని, అందుకనే రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అందుకు ఇదే సరైన సమయమని భావించినట్టు పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన ఆటను అత్యున్నత స్థాయిలో ఆడేందుకు సహకరించిన భార్య అమీ, సహచరులు, క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఫించ్ పేర్కొన్నాడు.