కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కోల్పోయి పనులులేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే ఆపత్కాలపు ఆసరా (కరోనా సాయం)కు నేటి నుంచి అందజేయనున్నారు. మొత్తం 2,06,345 దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా రావడంతో అందులో కరోనా సాయం కోసం సోమవారం సాయంత్రం వరకు అర్హులైన 1లక్షా 24 వేల మందిని విద్యాశాఖ అధికారులు ఎంపిక చేరు.
ఈ రోజు (మంగళవారం) నుంచి 1.24 లక్షల మందికి రూ.2 వేల ఆర్థిక సాయం వారి వారి బ్యాంకు అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నగదు పంపిణీ, 21 నుంచి 25వ తేదీ వరకు 25 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు. అర్హుల్లో ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలు ఉన్నా అలాంటివారికి కరోనా సాయంను స్కూళ్లు పునఃప్రారంభమయ్యేంత వరకు ప్రతి నెల రూ.2 వేలునగదు, 25 కిలోలసన్న బియ్యం ను అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు గత నాలుగు రోజులుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అర్హులైన వారి దరఖాస్తులు పరిశీలించి లబ్దిదారు లను ఎంపిక చేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది 2.06 లక్షల మందివరకు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే యూడైలో నమో దైన వివరాల ప్రకారమే 1.45 లక్షల మందికి మాత్రమే మొదట కరోనా సాయం అందజేసి మిగిలిన దాదాపు 65 వేల మందికి కూడా ప్రభుత్వం నిధులు
మంజూరు చేస్తే అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చిన దరఖాస్తులను జిల్లాల వారీగా ఎంపిక చేపట్టి కలెక్టర్ ఆమోదం తీసుకుని ఆ జాబితాను విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపించారు. అదే జాబితాను ఆర్థికశాఖకు పంపించారు. నగదు సాయం అందజేసేందుకు ఇప్పటికే రూ.32 కోట్లు మంజూరు చేయగా, బుధవారం నుంచి పంపిణీ చేసే 3.625 టన్నుల సన్న బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఇప్పటికే సిద్ధం చేసి ఉంచింది. లబ్ధిదారుడి పేరు, బ్యాంక్ ఖాతా, ఆధార్, ఫోన్ నంబర్లతో కూడిన జాబితాను విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి ఆర్థిక శాఖకు సోమవారం చేరినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత మంగళవారం నుంచి 24వ తేదీ వరకు రూ.2 వేలు నగదును బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. అదేవిధంగా లబ్ధిదారులు నివాసం ఉండే సమీపంలోని రేషన్ షాపు ద్వారా 25
కిలోల సన్న బియ్యాన్ని ఈ నెల 21 నుంచి 25 వరకు పంపిణీ చేయనున్నారు. నేటికి ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.