హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉద్యోగ భర్తీ ప్రక్రియ మరింత ఊపందుకుంది. శనివారం రాష్ట్రంలో మరో 2440 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. విద్యాశాఖ, ఆర్చీవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్ధిక శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఇంటర్మీడియెట్ విద్యావిభాగంలో 40 లైబ్రరేరియన్ పోస్టులు, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఆర్చీవ్స్ విభాగంలో 14 పోస్టులను, పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 లెక్చరర్ పోస్టులు, 14 ఇన్‌స్ట్రక్చర్ పోస్టులు, 31 లైబ్రరేరియన్, ఐదు మాట్రన్, 25 ఎలక్ట్రీషియన్, 37 పీడి పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతించింది. కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చర్లు, 24 లైబ్రరేరియన్లు, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
శరవేగంగా దూసుకుపోతూ నిరుద్యోగులకు ఉపాధిని విస్తృతం చేసిన తెలంగాణ సర్కార్ మరో 2440 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం ఆర్ధిక శాఖ ఉత్తర్వులు వెల్లడించింది. నియాక ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు 49428 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. మరిన్ని పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పోలీసు, అటవీ, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఇప్పటికే ఆర్ధిక శాఖ పలు ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఈ దిశగా ఆయా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నియామక ప్రక్రియ వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.