Wednesday, November 20, 2024

ఆర్‌-5 జోన్‌ లే-అవుట్లకు తుదిరూపు.. కొత్త వెంచర్‌ పనుల్లో స్పీడ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతి ఆర్‌- 5 జోన్‌లో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకం కింద పంపిణీ చేయనున్న లేఅవుట్లు తుదిరూపు సంతరించుకుంటున్నాయి.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సోమవారం నుంచి పనులు మరింత ముమ్మరం చేశారు. రెవెన్యూ, పురపాలకశాఖ, సీఆర్‌ డీఏ అధికారులు సమన్వయంతో పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆఘమేఘాలపై ఉరకలు, పరుగులు తీస్తున్నారు.. గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల ధాటికి ధ్వంసమైన లేఅవుట్లను పునరుద్ధిరిస్తున్నారు.. ఎన్‌టీఆర్‌, గుంటూరు జిల్లాలో 50 వేల మందికి పైగా పేదలకు నిర్దేశించిన ఈ ప్లాట్లను 1402.58 ఎకరాల విస్తీర్ణంలో 25 లేఅవుట్లను అభివృద్ధి చేశారు.

- Advertisement -

మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తిచేస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఇందులో కొత్తగా భూ సేకరణ జరిపిన 268 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఈనెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటి వరకు సేకరించిన భూమికి జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తయిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెప్పారు. అన్ని లేఅవుట్లలో మెరకవేసి హద్దురాళ్లతో పాటు మార్కింగ్‌ నిర్వహిస్తున్నారు.

అంతర్గత రవాణా కోసం 76.28 కిలోమీటర్ల మేర గ్రావెల్‌ రోడ్లు ఏర్పాటవుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాకు 751.93 ఎకరాల్లో 14 లేఅవుట్లు, గుంటూరు జిల్లా పేదల కోసం 650.65 ఎకరాల్లో 11 లేఅవుట్లు సిద్ధం చేశారు. మార్కింగ్‌, నెంబరింగ్‌ ప్రక్రియను సీఆర్‌ డీఏ కమిషనర్‌ పరిశీలించారు. అన్ని లేఅవుట్లకు అవసరమైన 67,700 హద్దురాళ్ల ఏర్పాటు పనులు కూడా పూర్తికావచ్చాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement