హైదరాబాద్ : బంగ్లాదేశ్‌పై వరుస విజయాలతో జోరు ప్రదర్శిస్తున్న టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. రేపు (శనివారం) రాత్రి 7 గంటల నుంచి హైదరాబాదలోని రాజీవ్ గాంధి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.
బ్యాటింగ్‌కు అచ్చి వచ్చే హైదరాబాద్ పిచ్‌పై పరుగుల వరద పారించేందుకు టీమిండియా బ్యాటర్లు ఆతృతగా ఉన్నారు. అయితే ఈ నామమాత్రపు చివరి మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత తుది జట్టులో కొన్ని మార్పులకు అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో మరో తెలుగు కుర్రాడు తిలక్ వర్మను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్‌కు ఇది చివరి మ్యాచ్. ఈ మూడో టీ20తో వారి పర్యటన ముగుస్తోంది. అయితే వారు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యారు. ముందు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కి గురైన బంగ్లా.. ఆ తర్వాత వరుసగా రెండు టీ20ల్లోనూ ఓటములను చవిచూసింది.
ఇక మిగిలిన ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి తమ పరువు దక్కించుకోవాలని చూస్తోంది. అలాగే తమ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లాకు గ్రాండ్ ఫెర్వెల్ ఇవ్వాలని బంగ్లా ఆటగాళ్లు చూస్తున్నారు. బంగ్లాదేశ్ సీనయర్ క్రికెటర్ 38 ఏళ్ల మహ్మదుల్లాకు ఇది చివరి టీ20. ఈ మ్యాచ్‌తో అతడి పొట్టి క్రికెట్ కెరీర్ ముగియనుంది. అతను ఇటీవలే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తుది జట్ల వివరాలు: (అంచనా)
భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య/తిలక్ వర్మ, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్/హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిత్ హ్రిదోయ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, మెహదీ హసన్, రిషాద్ హుస్సేన్, టస్కీన్ అహ్మద్, తంజీమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.