సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. గురువారంతో ఏడోది, చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడింది. దీంతో రెండు నెలలుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటో తేదిన జరిగే ఏడో దశ పోలింగ్ తో పూర్తి కానుంది. ఏడు రాష్ట్రాలలోని 57 లోక్‌సభ సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 904 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ఏడో దశలో యూపీలో13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. బీహార్‌లోని 8, పశ్చిమ బెంగాల్‌లో 9, జార్ఖండ్ 3, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీఘర్‌కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.
బరిలో ప్రధాని మోదీ… కంగనా
ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. మోదీ ఇక్కడ నుంచి మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది కాకుండా, బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ మండి నుండి బరిలో ఉన్నారు. గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్, సమాజ్‌వాదీ అభ్యర్థి కాజల్ నిషాద్ మధ్య పోటీ నెలకొంది. హమీర్‌పూర్ నుంచి బీజేపీ తరఫున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరఫున సత్యపాల్ సింగ్ రైజాదా బరిలో ఉన్నారు. డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు
జూన్ ఒకటిన చివరి దశ పోలింగ్ ..
జూన్ 1 జరిగే ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో 542 లోక్ సభ సీట్ల ఫలితాలను జూన్ 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది . మొత్తంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ శనివారంతో ఎన్నికల క్రతువు పూర్తవుతోంది. ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన మొదట దశ పోలింగ్.. జూన్ 1 జరిగే ఏడో విడత పోలింగ్‌తో మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.