Monday, November 25, 2024

Delhi | పొత్తులపై పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం : సోము వీర్రాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల గురించి తమ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు ముగిసిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జనసేన పార్టీ తమ మిత్రపక్షంగా ఉందని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యనే తమ అధిష్టానం పెద్దల్లో ఒకరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారని గుర్తుచేశారు. అయితే పొత్తులపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే తాము ముందుకెళ్తామని తెలిపారు.

దేశవ్యాప్తంగా బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేలా, ఎన్డీఏ కూటమి 400 కు పైగా సీట్లు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు వెల్లడించారు. రెండ్రోజుల సమావేశాల్లో విపక్ష ఇండి కూటమి వైఫల్యం, అంతర్గత విబేధాల గురించి కూడా చర్చించినట్టు తెలిపారు. బీజేపీని, ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే పరిస్థితి ఎవరికీ లేదని సోము వీర్రాజు అన్నారు. ఎన్డీఏ అవినీతిరహిత, అభివృద్ధి కూటమిగా ఉందని తెలిపిారు. దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన లబ్ది చేకూరేలా సుమారు 100 రకాల పథకాలు అమలవుతున్నాయని, ఒక వ్యక్తికి 10 రకాల లబ్ది చేకూరేలా కొన్ని పథకాలున్నాయని వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు.

టార్గెట్ 370 అందుకే

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సమయంలోనే ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పామని, అది నిజం చేసినందుకు గుర్తుగా ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 370 సీట్లు టార్గెట్ పెట్టుకున్నామని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. అయోధ్య రామమందిరం దేశ ప్రజల 500 ఏళ్ల కల అని, దాన్ని నిజం చేసిన విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రల గురించి ఈ సమావేశాల్లో మాట్లాడినట్టు చెప్పారు. ప్రతి కార్యకర్త నూతన ఉత్సాహంతో రానున్న 100 రోజుల్లో కఠోరంగా పనిచేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు.

2004 నుంచి 2014 వరకు దేశ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా నాటి యూపీఏ చేసిన దుశ్చర్యల గురించి మాట్లాడినట్టు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం బీజేపీ కదం తొక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పొత్తుల గురించి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, దేశం కోసం ఆలోచించే కూటమిగా.. దేశానికి దిశానిర్దేశం చేసేలా కూటమి ఏర్పడుతుందని అన్నారు. ఏపీలో పొత్తులపై ఏ నిర్ణయం తీసుకున్నా శిరోదార్యంగా భావించి ముందుకెళ్తామని మాధవ్ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement