Tuesday, September 24, 2024

పొత్తులపై తుది నిర్ణయం జాతీయ నాయకత్వానిదే: పురందేశ్వరి

అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికల పొత్తు అనేది జాతీయ నాయకత్వమే నిర్ణయిస్తుంది తప్ప రాష్ట్ర నేతలు కాదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. ఇక్కడి పరిస్థితులపై జాతీయ నాయకత్వం చర్చిస్తే అభిప్రాయాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతానికి తాము జనసేనతోనే పొత్తులో ఉన్నామని మరోసారి ఉద్ఘాటించారు. పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి ఆదివారం స్పందిస్తూ..పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదన్నారు.

బీజేపీ జాతీయ నాయకత్వానికి అన్ని పరిస్థితులను వివరించనున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇక్కడి పరిస్థితులను తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతామని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా చెప్పినందున తమతో అధిష్టానం చర్చిస్తే తమ అభిప్రాయాలు వెల్లడిస్తామన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందనేది వాస్తవం కాదని పురందేశ్వరి స్పష్టం చేశారు.

చంద్రబాబు అరెస్టు చేసిన విధానాన్ని తొలుత తప్పుబట్టింది బీజేపీ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఖండించినట్లు ఆమె చెప్పారు. సీఐడీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement