ఇండియా-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా భారత్‌లో క్రికెట్ క్రేజ్ తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మరో రెండు రోజుల్లో జరగనున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు భారతీయ సినీ తారలు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరు కానున్నారు. ఇప్పటీకే బీసీసీఐ కార్యదర్శి జైషా లెజెండరీ పర్సన్స్‌కు ‘గోల్డెన్ టిక్కెట్లు’ అందించారు. గోల్డెన్ టిక్కెట్ హోల్డర్‌లతో పాటు, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు చాలామంది వీఐపీలు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు.
అలాగే, బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ మ్యాచ్ కు ముందు ఓ మ్యూజికల్ ఈవెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది. లైట్ షో, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటాయని మీడియాలో వార్తలు వచ్చాయి. మ్యూజికల్ ఈవెంట్ తో పాటు ఇతర ఈవెంట్‌లు అరగంట పాటు సాగుతాయని తెలుస్తోంది. మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్ పడనుండగా.. ఈ ఈవెంట్ లు మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రారంభమై 1:10 గంటలకు ముగుస్తుందని భావిస్తున్నారు.
ఇక బద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు NSG బ్లాక్ క్యాట్ కమెండోలను మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ తెలిపారు. NSGతో పాటు 7 వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంటుందని.. అందుకే దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని మాలిక్ వివరించారు. మ్యాచ్ నేపథ్యంలో నరేంద్రమోదీ స్టేడియం వద్ద ఎలైట్ టెర్రర్ నిరోధక దళం (NSG), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), హోంగార్డులు, గుజరాత్ పోలీసులతో సహా దాదాపు 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వివరించారు.