కొంతకాలంగా సినీ పరిశ్రమలో సందిగ్ధత నెలకొంది. ఓ సినిమా బడ్జెట్‌లో హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్స్ యాభై శాతానికి పైగా ఉంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం 60 కోట్ల నుండి 100 కోట్ల దాకా పారితోషికాన్ని తీసుకుంటున్నారు. భారీ రెమ్యునరేషన్స్ కారణంగా నిర్మాతలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నష్ట నివారణ చర్యల కోసం టాలీవుడ్ పెద్దలు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్స్‌పై ఫిలిం చాంబర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనను విడుదలచేసింది.
ఈ నెల 10వ తేదీ నుండి కొత్త రూల్స్ అమలులోకి రానున్నట్లు ఫిలిం చాంబర్ ప్రకటించింది. ప్రస్తుతం చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు రోజువారీ ప్రతిపాదికన రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. ఇకపై డే వైజ్ రెమ్యునరేషన్స్ ఇవ్వకూడదంటూ ఛాంబర్ నిర్ణయం తీసుకున్నది. స్టార్ హీరోలు, హీరోయిన్ల సహాయక సిబ్బంది ఖర్చులను ఇన్నాళ్లు నిర్మాతలే చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై ఆ భారాన్ని హీరోహీరోయిన్లే చూసుకోవాలని ఛాంబర్ రూల్ జారీ చేసింది.
పర్సనల్ స్టాఫ్, ట్రాన్స్ పోర్ట్, అకామిడేషన్, ఫుడ్ కు సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ని కలుపుకొనే హీరోలు, హీరోయిన్లతో పాటు సాంకేతిక నిపుణులకు రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్మాతలకు సూచించింది. పాత్ర, సినిమాల ఆధారంగా పారితోషికాన్ని ఫిక్స్ చేయాలని ఛాంబర్ రూల్ పెట్టింది. పారితోషికాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను సినిమా ప్రారంభానికి ముందే అగ్రిమెంట్ చేసుకోవాలని ఛాంబర్ పేర్కొన్నది. వాటికి సంబంధించిన అన్ని అనుమతులను ఛాంబర్ నుండి తీసుకోవాలని సూచించింది.