సినీ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద సోమవారం రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జయప్రదపై కేసులు నమోదు అయ్యాయి. దీనిపై ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా వెళ్లలేదు. దాంతో.. కోర్టు కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినా కూడా వాటిని విస్మరించారు నటి జయప్రద. ఈ క్రమంలో లుకౌట్ నోటీసులు జారీ చేయగా.. ఆమె ఇవ్వాల కోర్టు ముందు లొంగిపోయారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు సినీ నటి జయప్రద. అయితే.. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా ఆమె ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో జయప్రదపై రాంపూర్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇవే కేసుల విషయంలో కోర్టుకు వెళ్లాల్సి ఉండగా.. ఆమె వెళ్లలేదు. దీంతో జయప్రద వ్యవహారంపై రాంపూర్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాజీ ఎంపీ, సినీనటి జయప్రద పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. ఆమెపై సీఆర్పీసీ 82 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటూ.. ఒక డిప్యూటీ డీఎస్పీ నేతృత్వంలోని బృందాన్ని ఏర్పాటు చేయించింది. జయప్రదను వచ్చే నెల ఆరో తేదీ వరకు కోర్టు హాజరుపర్చాలని ఆదేశించింది. కానీ.. అంతకుముందే సోమవారమే (మార్చి 4వ తేదీనే) రాంపూర్ కోర్టు ముందు జయప్రద లొంగిపోయారు.