Wednesday, November 20, 2024

Big Story : కదులుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల ఫైళ్లు.. జోగులాంబ బరాజ్‌ సర్వే పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం ముదురుతున్నది. కృష్ణానదీ జలవనరులపై వాటాతేల్చడంలో కేంద్రజలశక్తి శాఖ వహిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణాజలపోరు ఉత్పన్నమైంది. అనుమతులు లేకుండా ఏపీ సర్కార్‌ జీఓ.203 తీసుకువచ్చి కొత్తప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుడితే ఆప్రాజెక్టులను నిలువరించి వాటా తేల్చాలని తెలంగాణ చేసిన డిమాండ్‌ కు కేంద్ర స్పందించక పోవడంతో, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ నూతన రిజర్వాయర్లను నిర్మించేందుకు జీఓ 8 తీసుకువచ్చింది. ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాల సర్వేలకోసం నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించింది.

ఈ మేరకు రాష్ట్ర నీటివనరుల శాఖ అధికారులు కొత్తప్రతిపాదనలతో రూపొందించిన నివేదికల పై ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలవాటతేల్చని పక్షంలో రాబోయే రోజుల్లో రెండురాష్ట్రాల మధ్య జలపోరు కొనసాగే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళనవ్యక్తం చేశారు. కృష్ణానదీజలాల యాజమాన్య సంస్థ స్పందించి వాటాలు తేల్చాలని జలనిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక ప్రతిపాదిత ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లితే ఇప్పటికే నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టులతో పాటుగా కొత్తగా పలు రిజర్వాయర్లప్రతిపాదనలను సిద్ధం చేసినట్లుసమాచారం.

నూతన రిజర్వాయర్లకు సర్వేలు

ఆంద్ర్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణానదీజలాలకు గండికొడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కాల్వ సామర్థ్యం పెంపు,శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు 80వేల క్యూసెక్కుల జలాల తరలింపు ను నివారించి తెలంగాణకు న్యాయం చేయాలని చేసిన విజ్ఞప్తులు ఎండమావులుగానే మిగిలి పోవడంతో తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రాజెక్టుల పై దృష్టిసారించింది. ఈమేరకు రూపొందించిన నివేదికలను, ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నూతన రిజర్వాయర్లు ఆనకట్టల నిర్వాణాలకోసం ప్రభుత్వ ఆదేశాలమేరకు జలమండలి సర్వేలు నిర్వహించి నివేదికలు సిద్ధంచేసింది.కృష్ణానదీ ఎగువన తుంగభద్ర కలిసే ప్రాంతంలో రిజర్వాయర్‌ నిర్మించి కృష్ణాజలాలను అక్కడి తెలంగాణ సాగుభూముల్లో పారించే ప్రణాళికను సిద్ధం చేశారు.

ఇందులో భాగంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల అంతర్భాగమైన ఎదుల రిజర్వాయర్‌ ఎత్తిపోసి స్థానిక రైతుల కోరికలను తీర్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే కృష్ణా వరదల కాలంలో రోజుకు ఒక టీఎంసీ నిటీని తరలించేందుకు కుసుమర్తి దగ్గర బీమా వరదకాలువ నిర్మించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయనీ, ఈ కాల్వ నిర్మాణం తో నిర్వాసితుల సమస్యకానీ, పర్యావరణ సమస్య కానీ ఉత్పన్నం కాదని జల నిపుణులు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. అలంపూర్‌గద్వాల ప్రాంతాల్లోి ఆర్‌ డీఎస్‌.నెట్టెంపాడు ఆయకట్టు పరిధిలోని సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మరో జలాశయం నిర్మించి కృష్ణాజలాలకు అడ్డుకట్ట

- Advertisement -

వేసేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని నిపుణులు తేల్చారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 20 టీఎంసీలు పెంచికృష్ణాజలాలను సద్వినియోగం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.అలాగే నాగార్జున సాగర్‌ టేల్‌ పాండ్‌ దగ్గర ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తే సుమారు రెండులక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశాలు అధికంగా ఉన్నాయనే అభిప్రాయంలో తెలంగాణసాగునీటి పాగుదల శాఖ ఉన్నట్లు సమాచారం. అయితే కొత్తగా ప్రాజెక్టులు నిర్మించి కృష్ణానదీ జలాలను సాగులోకి మళ్లించేందుకు అవసరమైన అనుమతులు పొందాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారులకుగ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఆంధ్రప్రభుత్వం అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మించి కృష్ణానదీ జలాలకు గండి కొట్టినా, కేంద్రం కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా తేల్చకున్నా రాబోయే రోజుల్లో కొత్తప్రాజెక్టుల వివాదం ముందుకు రానుందని సంబంధిత శాఖల అధికారులు చెప్పారు.

సూర్యపేట జిల్లాలో సుంకేశులకు వరదవెళ్లే జోగులాంబ గద్వాల జిల్లాలో నడిగడ్డ సాగునీటి అవసరాలకోసం రిజర్వార్‌ నిర్మించే ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కృష్ణా ఉపనదీ బీమా తెలంగాణలో ప్రవేశించే కుసుమర్తి గ్రామం దగ్గర బీమావరద కాలువనిర్మించేందుకు ప్రతిపాదనలను రూపొందించారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని మరో 20 టీఎంసీలు పెంచేందుకు అవసరమైన ప్రణాలికను నీటిపారుదల శాఖ రూపొందిస్తుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి భవిష్యత్‌ అవసరాలకోసం మరికొన్ని ప్రాజెక్టుల ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తుంది, అయితే ఈ ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు,టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.

త్వరలో… జోగులాంబ బరాజ్‌

సముద్ర మట్టానికి 840 అడుగుల ఎత్తులో జోగులాంబ బరాజ్‌ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రతిపాదిత ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మకంగా నిర్మించి కృష్ణా జలాలను జోగులాంబగద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదీపై అలంపూర్‌ దగ్గర గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు.పెద్ద మారూర్‌ గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలను రూపొందించింది. ఈ ప్రాజెక్టు నుంచి వరదనీటిని పైపులైన్ల ద్వారా తరలించేందుకు ప్రణాళికలను రూపొందించారు. బరాజ్‌ ఎత్తు 59 అడుగులు, 3.82 కిలోమీటర్ల పొడవు తో 55.3 టీఎంసీల సామర్థ్యం తో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వసామర్థ్యం 271.88 అడుగులు ఉండనుందని అధికారులు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం అనుమతులు లేని ప్రాజెక్టులను నిలపడంతో పాటుగా కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చక పోతే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement