న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణతో పాటు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో ఉండి రిజర్వేషన్ సదుపాయం పొందుతున్న బంజారా (లంబాడా) సామాజికవర్గాన్ని జాబితా నుంచి తొలగించాలని ఆదిలాబాద్ ఎంపీ (బీజేపీ) సోయం బాపూరావు డిమాండ్ చేశారు. లంబాడాలకు ఎస్టీ రిజర్వేషన్ కారణంగా ఆదివాసీల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.
లంబాడాలకు తొలుత కేవలం విద్యలో మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పారని, కానీ తర్వాత ఉద్యోగాలు, రాజకీయాలతో పాటు ఆదివాసీల భూములపై కూడా హక్కు కల్పించారని ఆయనన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిసి ఈ విషయంపై తమ అభ్యంతరాలను వెల్లడిస్తామని చెప్పారు. సంచార జాతులకు చెందిన లంబాడాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
మణిపూర్‌లో రిజర్వేషన్ల కారణంగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలను ఉదహరిస్తూ వాటిని లంబాడా-ఆదివాసీ కోయ తెగల మధ్య ఘర్షణతో పోల్చారు. మైటీ తెగకు ఎస్టీ హోదా కల్పించాలన్న హైకోర్టు తీర్పు కారణంగా ఘర్షణలు తలెత్తాయని, ఎస్టీ జాబితాలో చేర్చకుండా కుకీలు హింసాత్మకంగా ఆందోళనలు చేపడుతున్నారని అన్నారు. గిరిజన ఆదీవాసీలైన కుకీల మాదిరిగా నాడు ఆదివాసీలు లంబాడాలను జాబితాలో చేర్చకుండా అడ్డుకుని ఉండాల్సిందని అన్నారు. ఇప్పటికైనా తాము ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకు పోరాడతామని అన్నారు.