- ఫ్రాన్స్‌పై ఉత్కంఠ విజయం
- పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో గెలుపు
- 36 ఏళ్ల తర్వాత ప్రపంచ కిరీటం కైవసం
- మెస్సీ అద్భుత ప్రదర్శన..
- నెరవేసిన స్వప్నం
- ఎంబప్పె ఒంటరి పోరాటం వృథా..
- మెస్సీ నేతృత్వంలో అర్జెంటీనాకు.. పది ఫుట్‌బాల్ టోర్నీ కప్‌లు..
ఉత్కంఠ భరితంగా సాగిన ఫిఫా ఫైనల్‌లో విజయం అర్జెంటీనానే వరించింది. రెండు దిగ్గజ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. నాటకీయ మలుపుల మధ్య విజయం దోబూచులాడింది. నిర్ణీత సమయంలో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. ఇక్కడా ఇరు జట్లు 3-3 గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. అంతిమంగా విజేతను నిర్ణయించేందుకు పెనాల్టి షూటౌట్ అనివార్యమైంది. మొదటి నుంచీ అద్భుతంగా రాణించిన మెస్సీ గ్యాంగ్ పెనాల్టీ లోనూ అంతే అద్భుతంగా రాణించింది. నాలుగు గోల్స్ చేసి ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ఫిఫా కప్‌ను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ట్రోఫీని మూడవసారి కైవసం చేసుకున్న జట్టుగా అర్జెంటీనా రికార్డు సృష్టించింది. ఆలస్యంగా పంజుకున్న ఫ్రాన్స్, ఎంబప్పె ఒంటరి పోరాటంతో గెలుపు అంచుల దాకా వచ్చినప్పటికీ, అదృష్టం మాత్రం అర్జెంటీనావైపే మొగ్గుచూపింది. దాంతో డిఫెండింగ్ చాంపియన్‌కు ఓటమి తప్పలేదు. ఫైనల్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన ఫ్రెంచ్ టీమ్ ఆశలు అడియాసలయ్యాయి.
అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అనేక నాటకీయ మలుపులతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. క్షణం క్షణం ఉత్కంఠను రేకెత్తించింది. ప్రథమార్థంలో అర్జెంటీనా దూకుడు ప్రదర్శించగా, ద్వితీయార్థంలో ఎంబప్పె జూలు విదిల్చాడు. ఏకపక్షంగా ముగుస్తుందని భావించిన సమయంలో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అర్జెంటీనా ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. మెస్సీ గోల్ చేసిన ప్రతీసారి, నేనున్నానంటూ ఫ్రాన్స్ అభిమానులకు కొండంత ధైర్యం ఇచ్చేలా రెచ్చిపోయి ఆడాడు. ప్రథమార్థంలో మెస్సీ సేన పూర్తి ఆధిపత్యం సాధించగా, ద్వితీయార్ధంలో ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబప్పె చెలరేగాడు. మొదటి అర్ధ భాగం 23, 32 వ నిముషాల్లో అర్జెంటీనా రెండు గోల్స్ చేసింది. మెస్సీ బోణీ కొట్టగా, ఆ వెంటనే ఏంజిల్ డి మారియా మరొక గోల్‌కొట్టి జట్టుకు పూర్తి ఆధిక్యాన్ని చేకూర్చిపెట్టాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్ గోల్ ప్రయత్నాలు విఫలం కావడంతో, 2-0తో రెండవ అర్థభాగానికి వెళ్లింది.
అప్పటికే ఆధిక్యంలో ఉన్న అర్జెంటీనా ప్రత్యర్థికి గోల్ అవకాశం ఇవ్వకుండా డిఫెండింగ్ గేమ్ ఆడింది. దాదాపు అర్ధగంటకు పైగా మ్యాచ్‌ను నియంత్రణలో ఉంచుకోగలిగింది. ఆయితే 80వ నిముషంలో ఎంబప్పె తొలిగోల్‌తో ఫ్రాన్స్ అభిమానుల్లో ఆశలు చిగురింప జేశాడు. ఆ వెంటనే 81 నిముషంలోఇంకొక గోల్ చేసి స్కోరును 2-2గా సమం చేశాడు. ఆఖరి క్షణాల్లో ఏ జట్టూ మరొక గోల్ చేయలేక పోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. ఇక్కడ కూడా ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో 109వ నిముషంలో మెస్సీ గోల్ కొట్టి స్కోరును 3-2కి చేర్చాడు. కొద్దిసేపటి తర్వాత 118వ నిముషంలో ఎంబప్పె కూడా గోల్ కొట్టడంతో మ్యాచ్ 3-3తో సమం అయింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టిd షూటౌట్ అవసరం అయింది. ఇక్కడ అర్జెంటీనా ఆటగాళ్లుపూర్తి ఆధిపత్యం చెలాయించి నాలుగు గోల్స్‌చేశారు. ఫ్రాన్స్ కేవలం రెండు గోల్స్ మాత్రమే చేయడంతో విజయం మెస్సీ సేనవైపు మొగ్గింది.
టోర్నీలో అత్యధికంగా 8 గోల్స్‌తో రాణించిన ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబప్పెకు గోల్డెన్ బూట్ లభించగా, గోల్డెన్ బాల్ అవార్డును మెస్సీ దక్కించుకున్నాడు. అర్జెంటీనా కీపర్ ఇమిలియానో మార్టినెజ్‌కు గోల్డెన్ గ్లౌజ్ అవార్డు సొంతమైంది. అత్యధిక ఫిఫా మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు. ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్ అతనికి 26వది. ఇదివరకు ఈ రికార్డు జర్మనీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ (25 మ్యాచ్‌లు) పేరిట ఉండేది.