Friday, November 22, 2024

Big story | ఫిఫా ఫైనల్‌ ఫైట్‌.. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌- అర్జెంటీనాల మధ్య రేపే తుది సమరం

ఫిఫా సమరం చివరి అంకానికి చేరింది. 32 జట్లు పాల్గొన్న మహా సంగ్రామంలో ఇప్పటి వరకు 62 మ్యాచ్‌లు జరిగాయి. టైటిల్‌ కోసం రేపు (ఆదివారం) ఖతార్‌ వేదికగా ఫ్రాన్స్‌-అర్జెంటీనా జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది. టైటిల్‌ రేసులో సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జట్టు హాట్‌ ఫేవరెట్‌ గా ఉండగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఫ్రాన్స్‌ జట్టు పోరాటానికి సిద్దమైంది. ఇరుజట్లు ఇదివరకు రెండేసి పర్యాయాలు టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. 1978, 1986లో అర్జెంటీనా చాంపియన్‌గా నిలవగా, 1998, 2018లో ఫ్రాన్స్‌ చాంపియన్స్‌ కిరీటాన్ని దక్కించుకుంది. అర్జెంటీనాకు మెస్సీ సారథ్యం వహిస్తుండగా, ఫ్రాన్స్‌కు హుగో లారిసెస్‌ నాయకత్వం వహిస్తున్నాడు. రెండు జట్లు కీర్తి శిఖరాలతోపాటు, రికార్డుల కిరీటాలను కలిగివున్నాయి. నేటి మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు మునుపటి అనేక రికార్డులను బ్రేక్‌ చేసే అవకాశాలూ ఉన్నాయి.

ఫ్రాన్స్‌కు వైరల్‌ ఫీవర్‌..

తుది సమరం హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగుతుందని అందరూ అంచనా వేస్తున్న వేళ.. ఫ్రాన్స్‌ కు ఊహించని దెబ్బ తగిలింది. ముగ్గురు కీలక ఆటగాళ్లు మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వీరిలో స్టార్‌ డిఫెండర్లు రాఫెల్‌ వరానె, ఇబ్రహమా కొనాటె, అటాకర్‌ కింగ్‌ స్లే కోమన్‌ ఆడే విషయంలో టెన్షన్‌ నెలకొంది. వీరు ముగ్గురూ అనారోగ్యం బారిన పడ్డారు. స్వల్ప వైరల్‌ సిండ్రోమ్‌తో వీరు బాధపడుతున్నారు. దీంతో నిన్నటి ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా వీరు పాల్గొనలేదు. మరోవైపు ఫ్రాన్స్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు రాన్‌డల్‌ కోలో మౌని మాట్లాడుతూ, వీరిలో జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ, అవి అంత తీవ్రమైనవి కావని, వీరు కోలుకుని జట్టులోకి వస్తారనే ఆశాభావంతో ఉన్నామని చెప్పాడు.

- Advertisement -

మెస్సీ వర్సెస్‌ ఎంబప్పె..

అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్‌ పోరులోనే ‘బంగారు బూటు’ దక్కించునే ఆటగాడు ఎవరో కూడా తేలిపోతుంది. ఈ అవార్డు కోసం ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీ, ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు. మెస్సీ ఐదు గోల్స్‌ చేయగా.. మరో మూడింటికి సహకరించాడు. ఎంబప్పె కూడా ఐదు గోల్స్‌ చేసి.. మరో రెండింటికి సహకరించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ గోల్స్‌ చేస్తే వారికే బంగారు బూటు దక్కుతుంది. 1982 ప్రపంచకప్‌ నుంచి ‘గోల్డెన్‌ షూ’ పేరుతో ఈ అవార్డులను ఇస్తున్నారు. ఫుట్‌బాల్‌ ఆటగాడు ధరించే బూట్‌ ఆకారంతో ఉండే ఈ ట్రోఫీని ఇత్తడితో చేసి బంగారు పూత పూస్తారు. దీని బరువు దాదాపు కిలో వరకు ఉంటుంది. 2006 ప్రపంచ కప్‌ నుంచి దీని పేరును ‘గోల్డెన్‌ బూట్‌’ గా మార్చారు. ‘గోల్డెన్‌ బూట్‌’తో పాటు ‘గోల్డెన్‌ బాల్‌’, ‘గోల్డెన్‌ గ్లౌ’ అవార్డులను కూడా ఫిఫా ప్రపంచకప్‌లో అందిస్తారు. ఈ టోర్నీలో ఉత్తమ ఆటగాడికి బంగారు బంతి, ఉత్తమ గోల్‌ కీపర్‌కు బంగారు చేతి గ్లౌజు అవార్డులు ఇస్తారు. ఓటింగ్‌ ద్వారా ఈ విజేతలను ఎంపిక చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement