Sunday, November 24, 2024

ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.. ఇందిరా శోభన్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అమలు చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరా శోభన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా ఉద్యోగాలు లేక రోడ్డునపడ్డ 7,651 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని చెప్పి ఆశలు రేపిన ప్రభుత్వం, ఆచరణలో వారి ఆనందంపై నీళ్లు చల్లిందని అన్నారు. రెండు నెలలుగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోకుండా తాత్సారం చేయడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పనుల్లో ఎంతో అనుభవం ఉన్న ఉపాధి హామీ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు.

రెండు నెలలైనా అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లలో మళ్లీ ఆందోళన మొదలైందని ఆమె చెప్పారు. ఉద్యోగాల నుంచి తొలగించారన్న మానసిక క్షోభతో గతంలో 60 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు పాదయాత్ర, మరోవైపు న్యాయ పోరాటం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హాను కలిసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కట్టుబడాలన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను మానవతా దృక్పథంతో తక్షణమే విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేయాలని ఇందిరాశోభన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement