న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆప్ నిరసనల కారణంగానే తెలంగాణ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుని 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుందని ఆప్ ఢిల్లీ ఎమ్మెల్యే, ఆపార్టీ తెలంగాణా ఇంఛార్జి సోమ్‌నాథ్ భారతి అన్నారు. మంగళవారం ఆయన ఆప్ నాయకురాలు ఇందిరాశోభన్‌తో కలిసి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల పునరుద్ధరణ సమస్యను ఆప్ కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని సోమ్‌నాథ్ చెప్పారు. రూరల్ డెవలప్‌మెంట్ కేంద్ర కార్యదర్శిని కలిసి హైకోర్టు పునరుద్ధరణ ఉత్తర్వులతో సహా సాక్ష్యాధారాలను సమర్పించామని తెలిపారు. ఆప్ బాధితుల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ఉద్యమిస్తుందని భరోసా ఇచ్చారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా ఆప్ తెలంగాణా ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడం వల్లే వారిని తిరిగి నియమిస్తున్నట్టు కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. నియామకాల కోసం ఉద్యమిస్తూ మరణించిన వారందరికీ పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమయ్యే తమ పాదయాత్రలో విద్యా వాలంటీర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు, పంచాయతీ కార్యదర్శుల సమస్యలను చేపడతామని సోమనాథ్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..