సంక్రాంతి అంటే కొత్త శోభ.. సంక్రాంతి అంటే కొత్త పంట..సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ల రాక.. సంక్రాంతి అంటే భోగిమంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, కీర్తనలు, గాలిపటాలు, అరిశెలు, చకినాలు వంటి పలు రకాల నోరూరించే వంటకాలు… అంతేకాదు తగ్గేదేలే అంటూ పోటాపోటీగా కోడిపందాలు. దేశంలోని పలు రాష్ట్రాలు సహా తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అన్ని పండుగల్లా కాకుండా ఈ పండుగకు అనేక ప్రత్యేకతలున్నాయి. వరుస నాలుగు రోజులు జరిగే ఈ వేడుకలను చూడాలంటే పల్లెలవైపు చూడాల్సిందే. అందుకే ఈ పండుగ సెలవులకు ఎక్కడెక్కడ నుంచో స్వస్థలాలకు చేరుకుంటారు. ఇంటికి చేరే ధాన్య రాశులతో… కళకళలాడే గుమ్మాల తోరణాలతో విలసిల్లుతూ కొత్త కాంతిని తీసుకొచ్చేదే సంక్రాంతి.
సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్ధం. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. ఇక్కడి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన మొదలు తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము.
పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర,వస్త్రం, కూరగాయాలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవిదానం చేస్తారు. గోదానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని విశ్వసిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital