హైదరాబాద్, ప్రభ న్యూస్: వృత్తి, జీవనోపాధికోసం హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న ప్రజలు పండుగ వేళ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈనెల 5న దసరా పండుగ, 3న పెద్ద బతుకమ్మ పండుగ ఉండడం, వచ్చే గురువారం వరకు వరుస సెలవులు ఉండటంతో నగరంలోని చాలామంది సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లడానికి శనివారం 500 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. నగరంలోని నలు మూలల్లో జీవిస్తున్న ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లడానికి ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టేషన్లతోపాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి రైల్వేస్టేషన్లకు తరలివెళ్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి.
ట్రాఫిక్‌తో సమయానికి చేరుకోలేమని భావించినవారు మెట్రోరైలును ఆశ్రయిస్తుండంతో మెట్రోస్టేషన్లు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులు సీట్లకోసం సర్కస్ పీట్లు చేశారు. ఇదిలా ఉండగా నగరవాసులు సొంతూళ్లకు పయనం కావడానికి ఆదివారం 650 700ల ప్రత్యేక బస్సులను నిర్వహించిన ఆర్టీసీ, సోమవారం 700నుంచి 750వరకు, మంగళవారం 800నుంచి 850వరకు, బుధవారం (విజయదశమి రోజున) 120నుంచి 150బస్సుల వరకు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా నిర్వహించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి 8 ప్రత్యేక రైళ్లను నిర్వహించారు. ప్రజారవాణా ద్వారనే కాకుండా నగరం నుంచి సీమాంధ్ర ప్రాంతానికి వెయ్యికి పైగా ప్రైవేట్ బస్సులను సైతం నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో డిమాండ్ మేరకు ఛార్జీలు పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా వేలాది వ్యక్తిగత వాహనాల ద్వారా తరలివెళ్తుండటంతో టోల్‌ఫ్లాజాల వద్ద వందలాది వాహనాలు క్యూ కడుతున్నాయి. గత రెండురోజుల కాలంలో నగరం నుంచి పది లక్షలకు పైగా ప్రజలు సొంత గ్రామాలకు తరలి వెళ్లారని అంచనా వేస్తున్నారు.