న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయ మత్స్యకారుల సంఖ్య 2020తో పోల్చితే 2021లో పెరిగిందని కేంద్రం తెలియజేసింది. నరసారావుపేట ఎంపీ (వైఎస్సార్సీపీ) లావు శ్రీకృష్ణ దేవరాయలు శుక్రవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించింది. తమ వద్ద ఉన్న వివరాల ప్రకారం 2020లో 519 మంది భారతీయ మత్స్యకారులు విదేశీ జైళ్లలో ఉండగా, 2021 నాటికి ఆ సంఖ్య 799కి పెరిగిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. చాలా దేశాల్లో కఠినమైన గోప్యతా చట్టాలు అమలవుతున్నాయని, ఈ కారణంతో కచ్చితమైన సమాచారం తెలియదని స్పష్టం చేసింది. తద్వారా ఈ సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండే అవకాశం లేకపోలేదు. భారతీయ మత్స్యకారుల పరిస్థితిని తెలుసుకోవడానికి, అవసరమైన సహాయాన్ని అందించడానికి కాన్సులర్ అధికారులు స్థానిక జైళ్లు, నిర్బంధ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తారని కేంద్రం తెలిపింది.
ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలు మత్స్యకారుల ముందస్తు విడుదలకు, భారతదేశానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తాయని తెలిపారు. దర్యాప్తు, న్యాయపరమైన చర్యలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సంబంధిత దేశాల సంస్థలతో కూడా వారు సమన్వయం చేసుకుంటారని వివరించింది. భారతీయ మత్స్యకారులను సాధారణంగా విదేశీ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టే ఆరోపణలపై అరెస్టు చేస్తారని, నిర్దిష్ట దేశాల సంబంధిత చట్టాల ప్రకారం ఇతర కారణాలతో అక్రమంగా చేపలు పట్టడం, అక్రమంగా ప్రవేశించడం, అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను అక్రమంగా దాటడం వంటి వాటికి సంబంధించిన కేసులు నమోదు చేస్తుంటారని వివరించింది. జైల్లో గడిపే కాలం కూడా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని మంత్రిత్వ శాఖ వివరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.