Wednesday, June 26, 2024

Delhi | ఆస్ట్రోనాట్‌కు ఆత్మీయ సన్మానం.. పూర్వ విద్యార్థిని సత్కరించిన పాఠశాల యాజమాన్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశ కీర్తిప్రతిష్టలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే ‘మిషన్ గగన్‌యాన్’లో భాగమైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన అంగద్ ప్రతాప్‌ను ఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఆ పాఠశాలలోనే 12వ తరగతి వరకు చదువుకున్న అంగద్‌ అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. గురువారం పాఠశాల మేనేజింగ్ బోర్డ్ ఛైర్మన్ శంకర్ రెడ్డి ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకునే సమయంలోనే అంగద్ పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణతో మెలిగేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. పాఠశాల తరపున మేనేజింగ్ బోర్డ్ ఛైర్మన్ శంకర్ రెడ్డి, ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తూ.. “ట్రయంఫ్ ఓవర్ ది మూన్- జూనియర్ స్కూల్ సోరింగ్ హై” పేరుతో ఒక విజువల్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు.

గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ విజయాలను ప్రదర్శించారు. తాను చదివిన స్కూల్ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్న అంగద్.. భవిష్యత్ తరాలైన నేటి విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే విజయం సులభమవుతుందని అన్నారు. మానవరహిత మంగళ్‌యాన్, చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసిన ‘ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)’ తాజాగా మానవసహిత యాత్ర ‘గగన్‌యాన్’ తలపెట్టి, అందుకోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది.

వారికి అత్యంత కఠోరమైన శిక్షణనిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గగన్‌యాన్ వ్యోమగాములను దేశ ప్రజలకు కొద్దిరోజుల క్రితం పరిచయం చేశారు. ఆ నలుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా. వారిలో గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌ (పాతపేరు అలహాబాద్)లో 1982 జులై 17న జన్మించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టినా కేరళ మూలాలు కల్గిన అంగధ్ విద్యాభ్యాసం ఢిల్లీ, పూణే, హైదరాబాద్ నగరాల్లో సాగింది. పాఠశాల విద్య పూర్తిగా ఢిల్లీలోనే సాగింది.

ఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో ఆయన 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)కి సెలెక్టయి పూణేలో శిక్షణ పొందారు. అనంతరం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరి హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. సాయుధ బలగాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ‘స్వార్డ్ ఆఫ్ హానర్’ అవార్డును అందుకున్నారు.

- Advertisement -

భారత వాయుసేనలో జాగ్వార్, డార్నియర్, హాక్, సుఖోడ్-30, మిగ్-21, మిగ్-29 వంటి వివిధ రకాల యుద్ధవిమానాలను నడిపిన అనుభవం ఆయనకుంది. ఎప్పటికప్పుడు అధునాత శిక్షణ పొందుతూ వచ్చారు. అమెరికాలోని అలబామాలో ఉన్న ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజిలో ఎయిర్‌క్రాఫ్ట్ మిలిటరీ ట్రైనింగ్, వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజిలోనూ కటింగ్ ఎడ్జ్ మిలటరీ టెక్నిక్స్ నేర్చుకున్నారు. వ్యోమగామిగా ఎంపికైన తర్వాత రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ (GCTC)లో 13 నెలల పాటు అత్యంత కఠోరమైన ఆస్ట్రోనాట్ శిక్షణ పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement