Tuesday, November 26, 2024

విద్యార్థుల్లో భ‌యాల‌ను తొలగించాలి.. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం గత మూడేళ్లగా పాఠశాల విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, విద్యార్థుల మెరుగైన అభ్యసనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడే మౌలిక వసతుల కల్పన, నూతన పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయ శిక్షణలపై దృష్టి సారించిందని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ అన్నారు. విద్యార్థుల్లో అభ్యసన అంతరాలను తొలగించడానికి, తరగతికి తగిన సామర్థ్యాలను పొందడానికి పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్షా, ఎస్సీఈఆర్టీ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, యూనిసెఫ్‌ సంయుక్తంగా సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ పబ్లిక్‌ సిస్టమ్స్‌(సిప్స్‌) సౌజన్యంతో ‘లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం’పై ఒక రోజు కార్యశాల శుక్రవారం విజయవాడలో నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బుడితి రాజశేఖర్‌ మాట్లాడుతూ, కోవిడ్‌, ఇతర కారణాల వల్ల విద్యార్థుల్లో గల అభ్యసనాంతరాలను తొలగించడానికి ఈ వేదికను ఉపయోగిస్తూ ఆచరణ యోగ్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు-గా విద్యార్థుల అభ్యసన మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని అందుకు తగిన వనరులను వివిధ శాఖలు, సంస్థల ద్వారా అందిస్తామని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాలను పూర్తిస్థాయిలో పొందడానికి ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ప్రిన్సిపాళ్లను సరైన ప్రణాళికతో వ్యవహరించాలని కోరుతూ వారి వారి జిల్లాల్లో విద్యార్థుల మెరుగైన అభ్యసనకు బాధ్యత వహించాలని ఆదేశించారు.

‘గూగుల్‌ రీడ్‌ అలాంగ్‌’ యాప్‌ ఆవిష్కరణ..

కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంపొందించడానికి ‘గూగుల్‌ రీడ్‌ అలాంగ్‌’ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ యాప్‌ను ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు యాప్‌ ఉపయోగంపై ఇచ్చిన శిక్షణ ఆధారంగా వేసవి సెలవుల్లో ప్రతిపాదించిన 8 వారాల పాటు- చదివే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైట్‌ ప్రిన్సిపాళ్లు, మండల విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ, వార్డు విద్యా సహాయకులు సమూహాలుగా ఏర్పడి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనానికి ఎదురయ్యే ఆంటకాలు వాటి పరిష్కారాలు, అకడమిక్‌ మానిటరింగ్‌, సత్వర సహకారం, విద్యార్థుల మెరుగైన అభ్యసనానికి తల్లిదండ్రులు, గ్రామ పంచాయతీలు, తల్లిదండ్రుల కమిటీ-లు, పేరెంట్‌ టీ-చర్స్‌ అసోసియేషన్ల సమన్వయంతో కూడిన సహకారం, ఉపాధ్యాయులకు బోధన పట్ల సాంకేతిక సహకారం మొదలైన అంశాలపై చర్చించి ఆచరణయోగ్యమైన వివిధ అంశాలను ప్రతిపాదించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు షన్మోహన్‌, పాఠశాల విద్యాశాఖ సలహాదారు(ఇన్ఫ్రా) ఎ. మురళి, సిప్స్‌ డైరెక్టర్‌ అచలేంద్రరెడ్డి, యూనిసెఫ్‌ ఎడ్యుకేషనల్‌ స్పెషలిస్ట్‌ శేషగిరి మధుసూదన్‌, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డా. బి. ప్రతాప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement