అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎఫ్‌బీఐ అధికారులు షాక్ ఇచ్చారు. ఫ్లోరిడాకు సమీపాన ఉన్న పామ్‌బీచ్‌లోని ఆయన సొంత విడిది భవనం మార్ ఎ లాగో వద్దకు సోమవారం పెద్దసంఖ్యలో చేరుకున్న ఎఫీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక దస్త్రాలతో కూడిన పెద్దపెద్ద పెట్టెలను తమవెంట తీసుకువెళ్లారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను తనవెంట తీసుకువచ్చారన్న అభియోగంతొ కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఎఫ్‌బీఐ అధికారులు దారుణంగా వ్యవహరించారని, తన ఇంటికి పెద్ద సమూహంగా వచ్చి దాడులు చేశారని, బీరువా పగులగొట్టారని ట్రంప్ స్వయంగా ఓ ప్రకటనలో వెల్లడించారు. అమెరికా చరిత్రలో ఇది ఒక చీకటి రోజని, గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన నాయకులతో ఎఫ్‌బీఐ ఎన్నడూ ఇలా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. ఉదయం పది గంటల సమయంలో సోదాలకు సంబంధించిన సెర్చ్ వారంట్ ఇచ్చారని, ట్రంప్ రక్షణ సిబ్బంది తనిఖీలకు సహకరించారని ఎఫ్‌బీఐ వర్గాలు సమాచారమిచ్చాయి.
అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో ఎవరికీ ఇటువంటి పరిస్థితి రాలేదని, మాజీ అధ్యక్షుడికి వారెంట్ ఇవ్వడం, తనిఖీలు నిర్వహించడం పెద్ద పరిణామమని పామ్‌బీచ్ కౌంటీ స్టేట్ అటార్నీ డేవ్ అరోన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష రికార్డుల యాక్ట్ (పీఆర్‌ఏ) ప్రకారం పదవీ విరమణకు ముందే తాము జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పనిచేసిన దస్త్రాలు, ఈమెయిల్స్ సహా రికార్డులను నేషనల్ ఆర్చీవ్‌కు అప్పగించాల్సి ఉంటుంది. రహస్య డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అప్పగించాలని ఫెడరల్ చట్టాలు చెబుతున్నాయి. గత ఫిబ్రవరిలో శ్వేతసౌధాన్ని ట్రంప్ వీడేటప్పుడు ఆ సమాచారాన్ని నేషనల్ ఆర్చీవ్స్‌కు అప్పగించలేదు. 15 పెట్టెల్లో ఆ దస్త్రాలను మూలన పడేశారని, వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని, వాటిలో అత్యంత రహస్య దస్త్రాలు కూడా ఉన్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్న చట్టసభ కాంగ్రెస్ దృష్టికి తీసుకువచ్చారు. కాగా అధికారిక దస్త్రాల విషయంలో ట్రంప్ సరైన రీతిలో నిర్వహించలేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని తహతహలాడుతున్న ట్రంప్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నట్టే. కాగా ఎఫ్‌బీఐ సోదాల విషయం తెలుసుకున్న ట్రంప్ అభిమానులు ఆయన నివాసం మార్ ఎ లాగో వద్దకు వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పార్టీ పతాకాలు చేతబట్టి ఎఫ్‌బీఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా రహస్య దస్త్రాల విషయంలో ట్రంప్ వైఖరిని త్పుబట్టిన నేషనల్ ఆర్చీవ్స్… లోతుగా దర్యాప్తు చేయాలని కోరింది. కాగా ఎఫ్‌బీఐ సోదాలపై ట్రంప్ మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా నా ఇంటిపై అనవసరంగా, అసందర్భంగా తనిఖీలు చేశారని, అయినా తాను సహకరించానని ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రత్యర్థులపై ప్రయోగించిన ఆయుధంగానే పరిగణిస్తున్నానని, మూడో ప్రపంచ దేశాలు, విచ్ఛిన్నమైన దేశాల్లో వ్యవహరించేలా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం దిగజారి పనిచేస్తోందని, దాడులకు పాల్పడుతోందని ట్రంప్ మండిపడ్డారు. దేశంలో ఎన్నడూ లేని రీతిలో అవినీతి పెరిగిపోయిందన్నారు. సోదాల సమయంలో మా ఇంటిలో బీరువా పగలగొట్టారని ఆరోపించారు. కాగా ట్రంప్ ఇంట్లో సోదాలు నిర్వహించాల్సిందిగా బిడెన్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వైట్‌హౌస్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.