పశ్చిమబెంగాల్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు. వివరాలలోకి వెళితే రాష్ట్రంలోని కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మకి ఐదు నెలల వయసు ఉన్న కవల పిల్లలు ఉన్నారు. ఇటీవల ఇద్దరు పిల్లలూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కలియాగంజ్ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆ చిన్నారులను సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. దీంతో ఆ బిడ్డను దేవశర్మ భార్య ఇంటికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతున్న మరో కుమారుడు గత శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అంబులెన్స్ కోసం వెళ్లగా డ్రైవర్లు రూ.8 వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు అతని వద్ద లేకపోవడంతో చేసేదేమీ లేక చిన్నారి మృతదేహంతో బస్టాండ్‌కు పయనమయ్యాడు. మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచి సుమారు 200 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి కలియాగంజ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు.
ఈ ఘటనపై దేవశర్మ మాట్లాడుతూ.. ‘ఆరు రోజుల చికిత్స తర్వాత నా ఐదు నెలల బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని ఆసుపత్రి సిబ్బందిని అడిగా. అయితే, ఇందు కోసం అంబులెన్స్ డ్రైవర్లు రూ.8వేలు డిమాండ్ చేశారు. అంత డబ్బు నా వద్ద లేదు. దీంతో కుమారుడి మృతదేహంతో బస్సులో వెళ్లాను. మృతదేహంతో బస్సు ఎక్కితే.. ప్రయాణికులు, సిబ్బంది దించేస్తారని భయపడ్డా. అందుకే ఎవరికీ తెలీకుండా నా ఐదు నెలల కుమారుడి మృతదేహాన్ని బ్యాగులో దాచా. కలియాగంజ్‌లోని వివేకానంద కూడలిలో దిగి.. అక్కడ ఓ వ్యక్తిని సంప్రదించగా అతడు నాకు అంబులెన్స్ ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నా’ అని దేవశర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.