మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు వంతెనపైనుంచి పడిపోవడంతో 24మంది మృతి చెందగా, మరో 41మందికి పైగా గాయపడ్డారని రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు మిశ్రా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలుపుతూ పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుండి మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ ఒక్కొక్కరికి 4 లక్షల రూపాలయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ. 50వేలు, స్వల్పంగా గాయపడివారికి రూ. 25వేలు అందజేస్తామని మిశ్రా తెలిపారు.
చికత్సకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. బస్సు ఓవర్ లోడ్‌తో అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఖర్గోన్ జిల్లా అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పటేల్ తెలిపారు. బస్సులో 70మంది ప్రయాణీకులు ఉన్నారని, ఆ బస్సులో కేవలం 37మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. తీవ్రంగా గాయనపడిన 18మందిని ప్రాథమిక చికిత్స అనంతరం తదుపరి చికిత్స కోసం ఇండోర్‌కు తరలించగా, 23మందిని ఖార్గోవ్ జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.