Tuesday, November 26, 2024

వేగంగా వృద్ధి చెందుతున్న స్టీల్‌ ఇండ స్ట్రీ.. పెరుగుతున్న ఉక్కు వినియోగం

మౌళిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నందున దేశంలో స్టీల్‌ ఇండస్ట్రీ వేగంగా వృద్ధి చెందుతున్నది. గత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌- డిసెంబర్‌ వరకు స్టీల్‌ ఉత్పత్తి 5.7 శాతం పెరిగితే, వినియోగం 11 శాతం వృద్ధి చెందింది. దేశంలో స్టీల్‌ ఉత్పత్తి, వినియోగం, పరిశ్రమ తీరుపై కేర్‌ ఎడ్జ్‌ రీసెర్చ్‌ రిపోర్టును విడుదల చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో స్టీల్‌ ఉత్పత్తి 117-119 మిలియన్‌ టన్నుల వరకు ఉండవచ్చని, సంవత్సరానికి 3-5 శాతం ఇది పెరుగుతుందని తెలిపింది. అదే సమయంలో స్టీల్‌ వినియోగం 10-12 శాతం వరకు ఉంటుందని కేర్‌ఎడ్జ్‌ నివేదిక పేర్కొంది. పలు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది.

ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లు…

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2020-2025 కాలంలో మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం 111 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యంతో నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ)ను ప్రారంభించింది. ప్రస్తుతం ఎన్‌ఐపీ కింద దేశ వ్యాప్తంగా 8,500 ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లను 100 లక్షల కోట్లతో చేపట్టారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌లతో పాటు, గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉడాన్‌ స్కీమ్‌ కింద ప్రాంతీ కనెక్టివిటీని పెంచేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇందు కోసం అదనంగా 50 ఎయిర్‌ఫోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌ ఎయిరోడ్రమ్స్‌ను, అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్స్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. రోడ్ల అభివృద్ధికి భారతమాల కార్యక్రమం, పోర్ట్‌ల ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి సాగర్‌మాల కార్యక్రమం, ఉర్జ గంగా గ్యాస్‌ పైపులైన్‌ ప్రాజెక్ట్‌, స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్ట్‌, అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువేనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (అమృత్‌) కింద చేపట్టే ప్రాజెక్ట్‌ల వంటి ప్రణాళికబద్దమన కార్యక్రమాలు అన్నీ సమిష్టిగా దేశంలో ఉక్కు ఉత్పత్తి, వినియోగం పెరిగేందుకు దోహం చేస్తాయని నివేదిక పేర్కొంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇనిషియేటివ్స్‌ ద్వారా లాజిస్టిక్స్‌ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించడం దేశీయ ఉక్కు డిమాండ్‌ను పెంచే అంశం.

గృహ నిర్మాణ స్కీమ్‌…

కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాజ్‌ యోజన స్కీమ్‌ను ప్రారంభించింది. అందుబాటు ధరలోనే మధ్య తరగతి, పేద వర్గాలు సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఈ స్కీమ్‌ కింద ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. ఇందు కోసం క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌
(సీఎల్‌ఎస్‌ఎస్‌)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఇది మరింత ఊపును అందించనుంది. ప్రజల కొనుగోలుకు, ఇంటి నిర్మాణ ఖర్చుకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం నిధులన 60 శాతానికి పైగా పెంచి 70 వేల కోట్లు కేటాయించింది. ఈ సీఎల్‌ఎస్‌ఎస్‌ స్కీమ్‌ను 2027 వరకు పొడిగించింది. ఈ స్కీమ్‌ మూలంగా దేశంలో స్టీల్‌ వినియోగం పెరిగేందుకు దోహదపడనుంది. ఇళ్ల నిర్మాణంలోనూ, స్టీల్‌ పైపులు, ఇతర అవసరాలకు స్టీల్‌ను భారీగా వినియోగించనున్నారు.

రైల్వే స్టేషన్ల అభివృద్ధి స్కీమ్‌…

కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల రీ-డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దేశంలోని 400 రైల్వే స్టేషన్లను డెవలప్‌ చేయాలని నిర్ణయించారు. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంలో (పీపీపీ) చేపట్టే ఈ కార్యక్రమానికి కేంద్రం లక్ష కోట్లు కేటాయించింది. రైల్వే స్టేషన్ల రీ డెవపల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను రైల్వే స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రైల్వేస్‌ రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) చేపట్ట నున్నాయి. మొత్తం 10 రాష్ట్రాల్లోని 400 రైల్వే స్టేషన్లను ఇలా డెవలప్‌ చేయనున్నారు. ఈ కార్యక్రమం దేశ ఆర్ధిక వ్యవస్థకు పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పనుంది. ఈ కార్యక్రమం స్టీల్‌ వినియోగాన్ని భారీగా పెంచనుంది. వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన హై స్పీడ్‌ రైల్‌ ప్రాజెక్ట్‌, సరకు రవాణా కోసం ప్రత్యేక లైన్ల నిర్మాణం ప్రాజెక్ట్‌, గతిశక్తి మల్టి మోడల్‌ కార్గో టెర్మినల్‌ ప్రాజెక్ట్‌ వంటికి కూడా స్టీల్‌ వినియోగాన్ని భారీగా పెంచగలవు.

ఈ కార్యక్రమాలన్నీ ఉక్కు వినియోగాన్ని భారీగా పెంచడంతో పాటు, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించనున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో కొత్త ట్రాక్‌ల నిర్మాణం, కొత్త కోచ్‌ల నిర్మాణం, విద్యుదీకరణ కార్యక్రమం, రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయల కల్పన వంటి వాటికి పెద్ద పీట వేశారు. ఈ కార్యక్రమాలకు కూడా స్టీల్‌ వినియోగం భారీగానే ఉంటుంది. ఇలాంటి అనేక ప్రధానమైన అంశాల మూలంగా దేశంలో రానున్న 5-7 సంవత్సరాల వ్యవధిలో స్టీల్‌ ఉత్పత్తి, వినియోగం భారీగా పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి మూలంగా ఇతర రంగాల్లోనూ స్టీల్‌ వినియోగం పెరగనుంది. మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ వంటి కార్యక్రమాలు కూడా స్టీల్‌ వినియోగాన్ని పెంచుతాయని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement