Friday, November 22, 2024

Big story | చినుకుతోనే చింత.. మ‌బ్బులుప‌డితే భ‌య‌ప‌డుతున్న రైతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అకాశంలో మబ్బులు/మేఘాలు కమ్ముకుంటే చాలు ఎక్కడ వర్షం పడుతుందోనని రైతులు బెంబేళెత్తిపోతున్నారు. రెండు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఎప్పుడూ ఏ దిశగా వర్షం, ఈదురుగాలులు, వడగళ్లు కురిసి పంట పాడువుతోందనని రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు రాష్ట్రంలో పలుచోట్ల కురుస్తుండడం అన్నదాతలను కలవరానికి గురి చేస్తోంది. తరచూ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుండడంతో ఎక్కడ వర్షం, వడగళ్లవాన కురుస్తోందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. రాగల నాలుగు రోజులపాటు అంటే ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటన రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరిచేలు కోతకొచ్చిన సమయం.

ఈ సమయంలో అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురుగాలులు వీస్తే చేతికొచ్చిన పంట నేలపాలవుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఇటీవల మార్చి మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల, వడగళ్లవానలకు పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం యాసంగి వరికోతలు మొదలైన నేపథ్యంలో మరో వారం, పది రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు రావొద్దని రైతులు వేడుకుంటున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పనెట్టి ఆరుగాలం కష్టపడి వరి పంటను సాగు చేశామని, పంట కోతకొచ్చిన దశలో వర్షాలు కురిస్తే పంట పూర్తిగా నష్టపోవడం ఖాయమని, ఆ తర్వాత అప్పుల పాలవడం తప్ప ఏమీ మిగలదని రైతులు వాపోతున్నారు.

- Advertisement -

ఈ ఏడాది యాసంగిలో 54లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా… ప్రస్తుతం 90శాతం పంట కోతకొచ్చింది. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు 7వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. అయితే ప్రస్తుతం అకాల వర్షాల హెచ్చరికలు, వాతావరణంలో మార్పులు, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో చేలల్లోనే వరి గింజలు రాలుతాయని, ఒకవేళ పంట కోసి కొనుగోలు కేంద్రానికి తరలించినా ఆరబెట్టడంలో ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు పొలాలు బురదమయంగా మారి కోతలు ఇబ్బంది అవుతున్నాయని, వరికోత మిషన్లు పొలాల్లో దిగబడుతున్నాయని రైతులు వాపోతున్నారు. వర్షాలకు ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయితే రంగుమారి తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాలని రైతులు వాపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో ధాన్యం త్వరగా ఆరేందుకు రైతులు రహదారుల పక్కన ఆరబోస్తున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోస్తే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారని, ఆరుగాలం కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి పంట పండి స్తున్నామని, రహదారులకిరువైపులా ధాన్యం ఆరబోతకు మినహాయింపు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

దళారుల దోపీడీ…
ప్రకృతి ప్రకోపంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దళారులు ఆసరాగా చేసుకుని అందినకాడికి రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2060 చెల్లిస్తుండగా , బీగ్రేడ్‌ ధాన్యానికి రూ.2040 ఇస్తోంది. అయితే దళారులు మాత్రం రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని రూ.1650 నుండి రూ.1700 వరకే ధర చెల్లించి దోచుకుంటుననారు. తక్కువ ధర చెల్లించడంతోపాటు క్వింటాలుకు అయిదు కిలోలు తరుగు పేరిట దండుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement